Traffic Restrictions : మూసీ నది ఉగ్రరూపం.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
భారీ వర్షాలకు మూసీ నది ప్రవాహం పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరద ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా..పలు మార్గాల్లో రాకపోకలు నిలిపేశారు. మూసారాంబాగ్ వంతెనకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అంబర్‌పేట – కాచిగూడ, మూసారాంబాగ్ – మలక్‌పేట మార్గాల్లో అనుమతించడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఇక దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి రహదారిపై రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని అంబర్‌పేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ రూ.52 కోట్లను కేటాయించినట్టుగా తెలిపారు. 2 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టుగా పేర్కొన్నారు.
జంట జలాశయాలకు వరద పోటెత్తింది. భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా తూముల ద్వారా అధికారులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. మరో రెండు రోజులు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు.యుద్ధ ప్రాతిపదికన షెల్టర్లు, అన్న వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.
జంట జలాశయాలు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరదనీరు భారీగా వస్తోంది. పరిగి, వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షాలతో రిజర్వాయర్లకు భారీగా నీరు వస్తుంది. ఉస్మాన్ సాగర్ 12 గేట్లు, హిమాయత్‌సాగర్ 8 గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి 12 వేల క్యూసెక్కుల వదులుతున్నారు. వరదనీటితో మూసీ వేగంగా ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల బ్రిడ్జిల పై నుంచి నీరు ప్రవహిస్తోంది. ప్రజలు అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మూసీనది ఉధృతి పెరగడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపేశారు.
భారీ వర్షాల కారణంగా.. వరదలో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. హిమాయత్ సాగర్ లేక్ సమీపంలో చిక్కుకున్న వారిని సైబరాబాద్ పోలీసులు రక్షించారు. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
సంబంధిత కథనం