Police Case on IG Palaraju: సూరీడు ఫిర్యాదు, ఐజీ పాలరాజు జోక్యంతో యువకుడి అక్రమ నిర్బంధం
Police Case on IG Palaraju: మాజీ సిఎం వైఎస్సార్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు ఫిర్యాదుతో అతని అల్లుడిని అక్రమంగా నిర్బంధించి హింసించిన వ్యవహారంలో ఏపీ పోలీస్ శాఖలో ఐజీగా పనిచేస్తున్న పాలరాజుపై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది.
Police Case on IG Palaraju: యువకుడిని అక్రమంగా నిర్బంధించి హింసించారనే అభియోగాలతో ఏపీ పోలీస్‌శాఖలో ఐజీగా పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు మరో ఇద్దరు తెలంగాణ పోలీస్ అధికారులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది. కోర్టు ఆదేశాలతో మాజీ సిఎం వైఎస్సార్ వ్యక్తిగత సహాయకుడు సూరీడుతో పాటు ముగ్గురు పోలీసు అధికారులపై కేసు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుతోపాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై బంజారాహిల్స్ పిఎస్‌లో కేసు నమోదైంది.
కుటుంబ వివాదాల నేపథ్యంలో తనపై దాడి చేసి, ఇబ్బందులకు గురిచేసిన మామ సూరీడుతో పాటు ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరీడు అల్లుడు సురేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. సూరీడు కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి గతంలో వివాహం చేశారు. వారికి ఓ కుమార్తె ఉంది. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సూరీడు కుమార్తె భర్తపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. 2021 మార్చి 23న మామాఅల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. అల్లుడిపై సూరీడు దాడి చేశాడు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్‌లో ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్‌రెడ్డి ఆరోపించాడు.
నిబంధనలకు విరుద్ధంగా తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని ఇబ్బందులకు గురిచేసి, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూర్యనారాయణరెడ్డి (సూరీడు), రాజశేఖర్‌రెడ్డి, నరేష్, పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మంగళవారం సురేందర్‌రెడ్డి మూడో అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి అతని వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. బంజారాహిల్స్ ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో పోలీసులు సంబంధిత నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిర్బంధించిన సమయంలో తనను పోలీసులు హింసించారని బాధితుడు ఆరోపించాడు.