KRMB : అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారు.. ఏపీపై కేఆర్ఎంబీకీ తెలంగాణ ఫిర్యాదు-telangana letter to krmb over andhra pradesh projects on krishna river ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krmb : అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారు.. ఏపీపై కేఆర్ఎంబీకీ తెలంగాణ ఫిర్యాదు

KRMB : అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారు.. ఏపీపై కేఆర్ఎంబీకీ తెలంగాణ ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu
Jul 26, 2022 10:22 PM IST

ఇటీవలే ఏపీపై కేఆర్ఎంబీకీ ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో లేఖ రాసింది. బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వపై అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

కేఆర్ఎంబీకి లేఖ
కేఆర్ఎంబీకి లేఖ

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసింది. బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వపై అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని లేఖలో తెలిపింది. విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ కారణంగా సాగర్ ఆయకట్టుకు ఇబ్బందులు వస్తాయని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరి కాదని తెలంగాణ లేఖలో వివరించింది. ఎత్తిపోతల నిర్మాణంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంది. ఏపీ చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులు అడ్డుకోవాలని బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇటీవలే ఏపీపై ఫిర్యాదు చేస్తూ.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖ రాశారు. ఆర్డీఎస్ కుడికాల్వ పనులను చూడాలని కోరారు. దీనిపై ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బోర్డు అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని లేఖలో మురళీధర్ ప్రస్తావించారు. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారన్నారు. పనులు ఆపేలా వెంటనే ఏపీకి ఆదేశాలివ్వాలని కోరారు.

అంతకుముందు లేఖలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ దిగువున మరికొంత నీటిని నిల్వ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని భావించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి దిగువున మరో రెండు ఆనకట్టల నిర్మాణానికి ఏపీ సర్కారు ప్రతిపాదించడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వీల్లేదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. నదీ జలాల కేటాయింపు లేకుండా ప్రకాశం బ్యారేజీ దిగువున ఆనకట్టలు నిర్మించాలని ప్రయత్నించడం సరికాదని అభ్యంతరం తెలిపింది.

కృష్ణా జలాలపై ఆధారపడి ఏపీ ప్రభుత్వం కొత్తగా పంప్డ్‌ స్టోరేజీ స్కీమ్‌ నిర్మాణం చేపట్టడంపై కూడా తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కర్నూలు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజీ స్కీం ప్రాజెక్టుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో తెలంగాణ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో మొదట తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాగునీటి కోసం కాకుండా కృష్ణా బేసిన వెలుపల ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పంప్డ్‌ స్టోరేజీ స్కీం ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు నీటిని కేటాయించడంపై అభ్యంతరం తెలిపింది. కేంద్రం జలసంఘం అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పంప్డ్‌ స్టోరేజీ స్కీం పథకాలను కేంద్రం పరిశీలించాలని తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌ చీఫ్ మురళీధర్‌ కృష్ణాబోర్డును కోరారు.

IPL_Entry_Point