Nalgonda BRS Office : 15 రోజుల్లో నల్గొండ BRS పార్టీ ఆఫీస్‌ను కూల్చేయండి..! హైకోర్టు ఆదేశాలు-telangana high court directed the officials to demolish nalgonda brs office building within 15 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Brs Office : 15 రోజుల్లో నల్గొండ Brs పార్టీ ఆఫీస్‌ను కూల్చేయండి..! హైకోర్టు ఆదేశాలు

Nalgonda BRS Office : 15 రోజుల్లో నల్గొండ BRS పార్టీ ఆఫీస్‌ను కూల్చేయండి..! హైకోర్టు ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 02:03 PM IST

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15 రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టినట్లు వివాదం నడుస్తోంది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

బీఆర్‌ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. 15 రోజుల్లో నల్గొండ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ పిటిషన్‌ కొట్టేవేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన  బీఆర్‌ఎస్‌ ఆఫీసును కూల్చివేసే దిశగా మున్సిపల్‌ అధికారులు అడుగులు వేశారు. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు… కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు.. బుధవారం విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

కొంతకాలంగా వివాదం…!

నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య కొత్త వివాదం నడుస్తోంది. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా పేరుపడ్డ హైదరాబాద్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు చెందిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని బీఆర్ఎస్ 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. అది కూడా గజానికి కేవలం రూ.100 మాత్రమే ఏడాదికి చెల్లించేలా అతి తక్కువ అమౌంట్ కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, జిల్లా బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా భవన్నాన్ని నిర్మించిందని వివాదం జరుగుతోంది.

ఆగ్రోస్ నుంచి లీజుకు తీసుకున్న ఎకరా స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని బీఆర్ఎస్ వినియోగించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతంలో, విలువైన భూమిని ప్రభుత్వ ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని జిల్లా మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. 

మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీసు నిర్మించిన స్థలం విలువ రూ.2 కోట్ల పైమాటే. స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే పేర్కొనడం ఇరు పార్టీల మధ్య వేడి పుట్టించింది.  మరోవైపు  బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసులు కూడా ఇచ్చేశారు.

జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏక పక్షంగా విలువైన భూమిని లీజు కింద తీసేసుకుందన్న ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. వాస్తవానికి నల్గొండ టౌన్ లో టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు సొంత ఆఫీసు భవనాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రకాశం బజారులో పాత బస్టాండు సమీపంలో భూమి ఉన్నా పార్టీ కార్యాలయ నిర్మాణం అరకొర పనుల తర్వాత నిలిచిపోయింది. అయితే, బీఆర్ఎస్ మొదటి నుంచీ తన పార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలోనే కొనసాగించింది.

2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం హయాంలో పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు జరగలేదు. 2018లో రెండో సారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు, భూమి పూజలు, భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023లో మూడో సారి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతి నుంచి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది.

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగ్రోస్ సంస్థకు ఉన్న విలువైన భూమిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. మిగిలిన భూమిలో బీఆర్ఎస్ కు ఎకరం స్థలాన్ని 99 ఏళ్లకు అతి తక్కువ లీజ్ అమౌంట్ కు ఇవ్వడంపై మొదట్లోనే విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. అయితే, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేతో పాటు, నల్గొండ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో భూ కేటాయింపులు తేలిగ్గా జరిగిపోయాయి. 

2023 ఎన్నికల తర్వాత నల్లగొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించడం, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఆర్ అండ్ బి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండడం, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై ఆవిశ్వాసం నెగ్గి, కాంగ్రెస్ చేతిలోకి మున్సిపాలిటీ వెళ్లిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నల్గొండ మున్సిపాలిటీ సిద్ధమైంది. దీనికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు కూడా తోడు కావటంతో విషయం కాస్త కోర్టు వరకు చేరింది. 

మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపే విధంగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారించిన కోర్టు…  అక్కడ ఆఫీస్‌ కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. ఆఫీసు కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని వ్యాఖ్యానించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘనే అవుతుందని చెప్పిన న్యాయస్థానం… 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.