Gruhalakshmi Scheme Guidelines : ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థికసాయం, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ఇవే!
Gruhalakshmi Scheme Guidelines : తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు.
Gruhalakshmi Scheme Guidelines :తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థికసాయం చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఎంఎస్25 ను విడుదల చేసింది. మహిళ పేరుపై ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఇంటిని లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ లో నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లబ్దిదారుల కుటుంబం ఫుడ్ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు చేయనున్నారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది.
రూ. 3 లక్షల ఆర్థికసాయం
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది. కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు గదులతో ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆహార భద్రత కార్డు, సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
4 లక్షల మందికి ఆర్థిక సాయం
గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నారు. 4 లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు. మరో 43 వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇస్తారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు బడ్జెట్ లో నిధులు సైతం కేటాయించింది. ఈ పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు మంత్రి ఆధ్వర్యంలో మూడు దఫాల్లో గృహలక్ష్మి అందిస్తారు. ఆర్థిక సాయం అందని వారిని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.