Women Clinics : మహిళల కోసం ప్రత్యేక ఉమెన్ క్లినిక్స్.. 57 రకాల టెస్టులు ఫ్రీ
Women Clinics : రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక ఉమెన్ క్లినిక్స్ ను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. 100 కేంద్రాల్లో క్లినిక్ లకు శ్రీకారం చుట్టనుంది. రానున్న రోజుల్లో 1200 కేంద్రాల ద్వారా సేవలు అందించనుంది. ఈ క్లినిక్ ల ద్వారా మహిళలకు బీపీ, షుగర్ తో పాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి.
Women Clinics : తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ఉమెన్ క్లినిక్ లు ప్రారంభిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న రాష్ట్రవ్యాప్తంగా 100 కేంద్రాల్లో మహిళా క్లినిక్ లు ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి మంగళవారం ఈ స్పెషల్ క్లినిక్ ల నిర్వహణ ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించనున్నారు. రానున్న రోజుల్లో 1200 కేంద్రాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించాలన్నది అధికారుల ప్రణాళిక. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గురువారం అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు మహిళా క్లినిక్ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మహిళా క్లినిక్ లలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి.. అక్కడే మందలు అందిస్తారు. బీపీ, షుగర్ తో పాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. 8 ప్యాకేజీల్లో 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక టెస్టులతో పాటు .. పోషకాల లోపం, ఎస్టీడీ, పీసీవోడీ, సంతానలేమి, మెనోపాజ్, ఐవీ తదితర సమస్యలకు వైద్య చికిత్సలు అందిస్తారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా శాంపిల్ సేకరణ, పరిశీలన చేస్తారు. 24 గంటల్లో రిపోర్టు అందించి.. మందులు అందిస్తారు. క్యాన్సర్ తదితర తీవ్ర సమస్యలు ఉంటే.. నిమ్స్, ఎంఎన్ జే వంటి పెద్దాసుపత్రులకి రిఫర్ చేస్తారు. మహిళా క్లినిక్ లకు వచ్చే పేషెంట్ల వివరాలన్నీ ప్రత్యేక యాప్ లో పొందుపరుస్తారు. వీటిని రిఫర్ ఆసుపత్రులకి లింక్ చేస్తారు. ఆయా ఆసుపత్రుల్లో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
దేశవ్యాప్తంగా 17 శాతం మహిళల్లో ఆయోడిన్ లోపం.. 37 శాతం మందిలో ఫోలిక్ యాసిడ్.. 54 శాత మందిలో ఐరన్.. 53 శాతం మందిలో విటమిన్ బీ -12 లోపం... 19 శాతం మందిలో విటమిన్ - ఏ.... 61 శాతం మందిలో విటమిన్ - డీ లోపం ఉన్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ.... ఉమెన్ క్లినిక్ లకు వచ్చే మహిళలకు థైరాయిడ్ సహా విటమిన్ పరీక్షలు చేయనున్నారు. మెరుగైన చికిత్స అవసరమైన వారికి పై హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తారు. లేదంటే వెంటనే మందులు ఇస్తారు. బరువుకు సంబంధించిన అంశంలో న్యూట్రిషన్ ను సూచించడమే కాకుండా యోగా, వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను కూడా మహిళలకు అందజేస్తారు.