TS Ayush Recruitment : త్వరలో ఆయుష్ వైద్యుల భర్తీకి నోటిఫకేషన్.. ?
TS Ayush Recruitment : తెలంగాణ వైద్య శాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ కు రంగం సిద్ధమవుతోంది. ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలన్న మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు... నోటిఫికేషన్ జారీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
TS Ayush Recruitment : తెలంగాణలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీలో భాగంగా... ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం... అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. ఇప్పటికే పోలీసు శాఖలో నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వివిధ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల భర్తీకి ఆదివారం పరీక్షలు ముగిశాయి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సహా హాస్టల్ వార్డెన్ పోస్టులకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో 11 వేలకుపైగా పోస్టులతో గురుకులాల నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రభుత్వ వైద్య సేవలను మరింతగా అభివృద్ధి చేయడంలో భాగంగా.. హెల్త్ డిపార్ట్ మెంట్ లోనూ వరుస ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వం... త్వరలో ఆయుష్ వైద్యుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో.. సర్వీసెస్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టుల నియామకాలు చేపట్టాలని సూచించారు. దీంతో.. నోటిఫికేషన్ జారీకి అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిని ప్రారంభించారని.. రిజ్వర్వేషన్ వారీగా ఖాళీల పై స్పష్టత వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటన జారీ చేస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో 428 ఆయుర్వేద... 184 యునాని... 199 హోమియోపతి... 28 నేచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో కొన్ని జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో కొన్ని.... వరంగల్ ఆర్డీడీ పరిధిలో మరికొన్ని డిస్పెన్సరీలు నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటిలో ఒక్క వైద్య అధికారి కూడా లేరు. ఈ నేపథ్యంలో... డిస్పెన్సరీల వారీగా ఖాళీల లెక్కలు తీస్తున్న అధికారులు.... వాటిని భర్తీ చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ విభాగంలో.. మొత్తం 328 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలు ఉండగా... వాటి నియామకానికి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
కాగా... వైద్య శాఖలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా.... డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను... వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల ఎంపిక పూర్తి చేసిన ప్రభుత్వం... వారికి నియామక పత్రాలు కూడా అందించింది.