TS Formation Day : నేడు సురక్ష దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు- హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
TS Formation Day : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
TS Formation Day : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్, బ్లూకోట్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం రాత్రి 9 గంటలకు బంజారాహిల్స్ ఐసీసీసీ నుంచి ఫుట్ పెట్రోలింగ్ ప్రారంభం కానుంది. సీవీఆర్/బీవీబీ జంక్షన్, జర్నలిస్టు కాలనీ, రోడ్ నం.45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా ఒరిస్సా ఇజ్లాండ్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. కవాతు కారణంగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి ర్యాలీ ముగిసేవరకు ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అత్యవసరం అయితే 9010203626 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్‌లో కార్యక్రమాలు
ఆదివారం ఉదయం 9 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఫ్లీట్ ర్యాలీని మంత్రి శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. 11.30 గంటల వరకు ర్యాలీ కొనసాగింది. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని మైదానంలో సాయంత్రం 4 గంటలకు పోలీస్ ఎక్స్ పో నిర్వహించనున్నారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌పై ఉమెన్ కార్నివాల్‌లో మహిళలు సాధించిన విజయాల షార్ట్ ఫిలిమ్ ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సీఎస్ శాంతికుమార్, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఉమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీ శిఖాగోయెల్, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొనున్నారు. దుర్గంచెరువు వద్ద సైబారాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు డ్రోన్ షో నిర్వహించున్నారు. రాత్రి 9 గంటలకు ఐసీసీసీ టవర్ నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ఫుట్ పెట్రోల్, మౌంటెడ్ పెట్రోల్ వాహనాలు ప్రదర్శించనున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.