TS Congress : ఎన్నికలకు మూడు నెలల ముందుగానే టికెట్లు ఖరారు- భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు!-telangana congress rahul asked key report on bhatti vikramarka on candidates section ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Congress : ఎన్నికలకు మూడు నెలల ముందుగానే టికెట్లు ఖరారు- భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు!

TS Congress : ఎన్నికలకు మూడు నెలల ముందుగానే టికెట్లు ఖరారు- భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 06, 2023 09:46 PM IST

TS Congress : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చివరి వరకూ కాకుండా ఈసారి ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా భట్టి నుంచి నివేదిక కోరినట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్

TS Congress : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సక్సెస్ అవ్వడంతో రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని కారులో వెంట బెట్టుకెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపైన ఆరా తీసినట్లు సమాచారం. నేతల సమన్వయంపైనా భట్టితో చర్చించారు. రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో ఎక్కడా ఏ విషయంలోనూ ఉపేక్షించకూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి పడ్డ కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీని తీసుకు వెళ్లటం, వారి సమస్యల పట్ల స్పందించటం పార్టీకి సానుకూలంగా మారిందని అధిష్ఠానం విశ్వసించినట్లు తెలుస్తోంది. ఖమ్మం సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు సమాచారం.

భట్టికి కీలక బాధ్యతలు

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాలపైన కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి విక్రమార్క.. టికెట్ల ఖరారు పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బతినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

వచ్చే నెలలోనే

ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటంతో ప్రతీ సారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సారి ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే నెలలోనే టికెట్లు ఖరారు చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు మూడు నెలల ముందుగానే టికెట్లు ఖరారు చేసేందుకు రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీని ద్వారా చివరి నిమిషంలో సీట్ల కోసం వివాదాలు నివారించవచ్చని, అభ్యర్థుల ప్రచారానికి సమయం ఎక్కువగా ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో భట్టి నుంచి రాహుల్ నివేదిక కోరటంతో అభ్యర్థుల ఎంపికలో భట్టి విక్రమార్క చేసే సూచనలు, ఇచ్చే నివేదిక పార్టీ అభ్యర్థుల ఖరారులో కీలకంగా మారనుందని సమాచారం.

Whats_app_banner