TS Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తులు, ఉచితం కాదు రూ.50 వేలు కట్టాల్సిందే
TS Congress : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులకు ఆఫర్ ఇచ్చింది. టికెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చని సూచించింది. అయితే రూ.50 వేలు కట్టాలని కండీషన్ పెట్టింది.
TS Congress : ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలు పార్టీలు జంప్ చేస్తున్నారు. ఈ పార్టీలో టికెట్ రాదని భావించి వేరే పార్టీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోకి ఎక్కువ వలసలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఆశావహులు ఎక్కువ కావడంతో ఆ పార్టీ నేతలు ఓ ఆఫర్ పెట్టారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు కొన్ని కండీషన్లు కూడా పెట్టారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు అవకాశం కల్పించింది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆగస్టు 18 నుంచి 25 వరకు ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. ఓసీ అభ్యర్థులైతే రూ.50 వేలు, బీసీలైతే రూ.25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదని తెలిపింది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత మంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ తెలిపింది. అయితే అప్లై చేసుకున్న వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందని సమాచారం. దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల్లో టికెట్లను కేటాయిస్తారని సమాచారం. ఆగస్టు 25 వరకు వచ్చిన దరఖాస్తులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ ఉంటుందని భావిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ఒత్తిడి పెరుగుతోంది.
సీనియర్లూ అప్లై చేసుకోవాల్సిందే
కాంగ్గెస్ పార్టీ సీనియర్లు దరఖాస్తుల విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. తాము కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే డౌట్ ఉన్నారు. అయితే దరఖాస్తుకు వెల నిర్ణయించింది కాంగ్రెస్ హైకమాండ్ కావడంతో అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అగ్రనేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో చివరి వరకూ అభ్యర్థుల ప్రకటన చేయకపోవడం మైనస్ అయిందని భావించిన అధిష్ఠానం.. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను దశలవారీగా ప్రకటించాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు నడుస్తోంది. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్న దానిపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. తొలి జాబితా సిద్ధమైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి టికెట్ హామీ ఇచ్చి పార్టీలో చేరుకుంటుంది కాంగ్రెస్. దీంతో టికెట్ విషయంలో పోటీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.