TS Assembly Elections 2023 : జనంలోకి గ్యారెంటీ కార్డు... ఆరు హామీల అస్త్రం పని చేస్తుందా..?
Telangana Congress: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచే దిశగా అడుగులేస్తోంది. ఆరు గ్యారెంటీ హామీల పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో పడింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగింది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేయటంతో పాటు… విజయభేరి సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అంతేకాదు కీలకమైన ఆరు హామీలతో గ్యారెంటీ కార్డును ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు ఈ గ్యారెంటీ కార్డుతోనే జనాల్లోకి వెళ్తున్నారు హస్తం నేతలు. దీంతో వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీ కార్డు కీలకంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లోకి ఆరు హామీలతో ….
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఆరు హామీలను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,ఏటా రైతులకు ఎకరాకు రూ.15 వేలు,ఇళ్లులేని కుటుంబాలకు ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు,తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉద్యోగాల భర్తీతో పాటు పలు అంశాలను ఇందులో పేర్కొంది. తాము అధికారంలోకి రాగానే ఈ హామీలన్నింటిని అమలు చేస్తామని… స్వయంగా సోనియా గాంధీతో ప్రకటించింపజేసింది రాష్ట్ర నాయకత్వం. ప్రజల్లోకి బలమైన సందేశాన్ని పంపే ప్రయత్నం చేసింది. సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ విజయవంతం కావటంతో… పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
దూకుడు పెంచిన కాంగ్రెస్….
ఆరు హామీల గ్యారెంటీని ప్రకటించటంతో నియోజకవర్గాల్లో నేతలు గట్టిగా పర్యటిస్తున్నారు. ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేడర్ ను యాక్టివ్ చేస్తూ…. దూకుడుగా ముందుకెళ్లేలాని చూస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రకటించిన కీలకమైన హామీలను అమలు చేస్తామని చెబుతున్నారు. పెన్షన్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ తో పాటు యువతను ఆలోచనలో పడేసేలా ఉద్యోగాల భర్తీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. రైతులు, మహిళలతో పాటు యువతను ఆకర్షించేలా మేనిఫెస్టో ఉండటంతో తమకు కలిసివస్తుందని నేతలు గట్టిగా భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా…. నియోజకవర్గాల్లోని నేతలను సమన్వయం చేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రేపోమాపో టికెట్లకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. 50 మందితో ఈ జాబితా ఉంటుందని తెలుస్తోంది. అసమ్మతికి చోటు ఇవ్వకుండా…. టికెట్లు రాని నేతలకు కూడా హామీ ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది.
మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ… కీలకమైన ఆరు హామీలు ప్రకటించటంతో పాటు కాంగ్రెస్ స్పీడ్ పెంచేసింది. త్వరలోనే ముఖ్య నేతల బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది. దీనిపై రేపోమాపో క్లారిటీ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్యారెంటీ కార్డు అస్త్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తుందా..? తెలంగాణ జనాలను మెప్పిస్తుందా…?అనేది ఆసక్తికరంగా మారింది.