TS Elections : 21 రోజుల్లో రూ.412 కోట్ల మార్క్- తెలంగాణలో సీజ్ చేసిన నగదు, బంగారం లెక్కలివే!-telangana assembly election total rs 412 crore worth of cash gold seized after election code ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Elections : 21 రోజుల్లో రూ.412 కోట్ల మార్క్- తెలంగాణలో సీజ్ చేసిన నగదు, బంగారం లెక్కలివే!

TS Elections : 21 రోజుల్లో రూ.412 కోట్ల మార్క్- తెలంగాణలో సీజ్ చేసిన నగదు, బంగారం లెక్కలివే!

HT Telugu Desk HT Telugu
Nov 01, 2023 05:33 PM IST

TS Elections : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ.412 కోట్ల వీలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో సీజ్ చేసిన నగదు
తెలంగాణలో సీజ్ చేసిన నగదు

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డబ్బు, బంగారం, మద్యాన్ని పోలీసు అధికారులు గత కొన్ని రోజులుగా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి మంగళవారం (అక్టోబర్ 31) వరకు నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులు స్వాధీనం ఏకంగా రూ.412 కోట్ల మార్క్ దాటిందని అధికారులు వెల్లడించారు.

yearly horoscope entry point

మొత్తం రూ.412 కోట్లు స్వాధీనం

తెలంగాణలో మంగళవారం ఒక్క రోజే రూ.16 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ మొదలైన అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు కేవలం 21 రోజుల్లో దాదాపు రూ.412 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం ఇతర వస్తువులను పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జప్తు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.103 కోట్లు మాత్రమే

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పట్టుబడ్డ నగదు, బంగారం, మద్యం అన్నీ కలిపి కేవలం రూ.103 కోట్లు మాత్రమే. అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా తనిఖీలు ప్రారంభించిన రోజే రూ.5.3 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం అక్టోబర్ 30 ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 31 ఉదయం 10 గంటల వరకు రూ.2.76 కోట్లు విలువ చేసే లోహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు రూ.39 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు, కుక్కర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిన్న ఒక్క రోజే రూ.4.17 కోట్లు విలువ చేసే మద్యం స్వాధీనం

ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటి వరకు రూ.165 కోట్ల విలువ చేసే 251 కిలోల బంగారం, 1080 కిలోల వెండి, వజ్రం, ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.4.17 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా ఇప్పటి వరకు మొత్తం రూ.40 కోట్లు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర ఏజెన్సీలు ఇప్పటి వరకు 80 కిలోల గంజాయి,115 కిలోల ఎన్డీపీఎస్ ను స్వాధీనం చేసుకోగా ఇప్పటి వరకు రాష్ట్ర అధికారులకు 1,041 కిలోల ఎన్డీపీఎస్, 5,163 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.22 కోట్లు. వీటితో పాటు 1.56 కేజీల సన్న బియ్యం, ఇతర వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం

• నగదు : రూ.145 కోట్లు

• మద్యం : రూ.40 కోట్లు

• ఆబరణాల : రూ.165 కోట్లు

• మాదకద్రవ్యాలు : రూ.22కోట్లు

• ఇతర వస్తువులు : రూ.39 కోట్లు

• మొత్తం రూ.412 కోట్లు

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner