T Congress Jagga reddy : వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి విమర్శలు
T Congress Jagga reddy వైఎస్సార్ తెలంగాన పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. షర్మిల జగన్, బీజేపీలు వదిలిన బాణమని ఆరోపించారు. వైఎస్ కుమార్తె అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించమని హెచ్చరించారు.
వైఎస్ షర్మిలపై తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ కూతురైతే మాత్రం ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వైఎస్ బాటలో షర్మిల నడవడం లేదని ఆరోపించారు. తెలంగాణలో పర్యటిస్తున్న షర్మిల బీజేపీ డైరెక్షన్ లోనే పనిచేస్తోందని ఆరోపించారు. తన యాత్రలో షర్మిల మోదీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. జగన్, బీజేపీ కలిసి వదిలిన బాణమే షర్మిల అన్నారు.
వైఎస్ కుమార్తెగా షర్మిల ఆయనకు ఉన్న ప పేరును దిగజార్చవద్దన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయాలంటే తమ దగ్గర కూడా చాలా విషయాలు ఉన్నాయన్నారు. విజయవాడలో హెల్త్ వర్సిటీకి పేరు మార్చడం తప్పని పేర్లు మార్చి వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. వివాదాలతో వైఎస్ఆర్‌కు చెడ్డపేరొస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని, సీఎం జగన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలని, ఏపీకి అమరావతినే రాజధాని ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంలో ఉందన్నారు. మూడు ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదని, సీఎం జగన్ ది తప్పుడు నిర్ణయం అన్నారు. అమరావతి పేరుపై చంద్రబాబు విస్తృత దృక్పధంతో నిర్ణయం తీసుకున్నారని జగ్గారెడ్డి చెప్పారు. మూడు చోట్ల 3 రాజధానుల అభివృద్ధి సాధ్యం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.