Suryapet News : పెళ్లి వేడుకలో విషాదం, కారు డోర్ లో తల ఇరుక్కొని చిన్నారి మృతి!-suryapet district ananthagiri nine year girl suffocated to death head stuck in car door ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet News : పెళ్లి వేడుకలో విషాదం, కారు డోర్ లో తల ఇరుక్కొని చిన్నారి మృతి!

Suryapet News : పెళ్లి వేడుకలో విషాదం, కారు డోర్ లో తల ఇరుక్కొని చిన్నారి మృతి!

Bandaru Satyaprasad HT Telugu
May 23, 2023 02:09 PM IST

Suryapet News : సూర్యాపేట జిల్లాలో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. పెళ్లి కారులో ఉన్న చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయింది. కారు డోర్ అద్దంలో చిన్నారి తల ఇరుక్కుపోవడంతో చిన్నారి మృతి చెందింది.

కారు అద్దంలో తల ఇరుక్కొని చిన్నారి మృతి
కారు అద్దంలో తల ఇరుక్కొని చిన్నారి మృతి (Pixabay )

Suryapet News : చిన్న పిల్లలు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వారిని తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలనే దానికి ఈ ఘటనే నిదర్శనం. కారు, బస్సు.. ఇలా వాహనం ఏదైనా కిటికీ దగ్గర సీటు అంటే చిన్నారులకు చాలా ఇష్టం. ఆ సీటు కోసం పోటీపడుతుంటారు. అలా కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటారు. ఈ అలవాటు పిల్లలకే కాదు పెద్దలకూ ఉంటుంది. కిటికీ వద్ద కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని డ్రైవర్లు పదే పదే చెబుతుంటారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు, తల కిటికీలోంచి బయటకు పెట్టవద్దని సూచిస్తుంటారు. కిటికీ నుంచి బయటకు చూస్తున్న చిన్నారి ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయింది.

అసలేం జరిగిందంటే?

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెంలో ఆదివారం రాత్రి పెళ్లి వేడుకలకు హాజరైంది ఓ కుటుంబం. ఈ ఫ్యామిలీలో బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి వరుడు, వధువు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చొని కిటీకీలోంచి తల బయట పెట్టి డ్యాన్స్ లు చూస్తుంది. చిన్నారిని గమనించని కారు డ్రైవర్ ... కారు అద్దాలు పైకి లేపాడు. దీంతో చిన్నారి కారు డోర్ అద్దంలో చిక్కుకుంది. చిన్నారి మెడ డోర్ లో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందింది. దీంతో పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. చిన్నారి తండ్రి బాణోతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకలు జరుగుతుండగా తొమ్మిదేళ్ల బానోతు ఇంద్రజ అనే బాలిక వధూవరులు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా బయటకు తల పెట్టి కూర్చుంది. కిటికీ నుంచి బరాత్ డ్యాన్స్ చూస్తుంది. చిన్నారి డ్యాన్స్ చూస్తుండగా కారు డ్రైవర్ చిన్నారిని గమనించకుండా డోర్ మిర్రర్ బటన్ నొక్కాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అద్దం పైకి కదలడంతో చిన్నారి మెడ అందులో ఇరుక్కుపోవడం డ్రైవర్ గమనించకపోవడంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. కొద్దిసేపటి తర్వాత, కిటికీలో చిన్నారి ఇరుక్కుపోయిందని గమనించిన స్థానికులు వెంటనే కారు డ్రైవర్ శేఖర్‌ కు సమాచారం అందించారు. డ్రైవర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను బయటకు తీయడానికి కారు కిటికీని కిందకు లాగాడు. అనంతరం బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే లోపే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంగా మార్చింది.

Whats_app_banner