ST Reservations: ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టుకే వెళ్లండి... సుప్రీం సూచన-supreme court directs petitioners to approach telangana high court on st reservations hike ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  St Reservations: ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టుకే వెళ్లండి... సుప్రీం సూచన

ST Reservations: ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టుకే వెళ్లండి... సుప్రీం సూచన

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 04:40 PM IST

ST Reservations: తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వ జీవో కొట్టివేయాలని పిటిషనర్లు కోరగా... రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు (HT_PRINT)

ST Reservations : రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ పెంపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై శుక్రవారం (ఫిబ్రవరి 17న) సుప్రీకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు రంజిత్ కుమార్, ఎంఎన్ రావు, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకి తెలిపారు.

చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సూచించిందని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా జీవో జారీ చేసిందని... దీని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికే లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని గిరిజనులకు నష్టం జరుగుతుందని వాదించారు. జీవో కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే... ఈ అంశంపై తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో గిరిజన, ఆదివాసీ సంఘాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆధార్ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్, ఆదిమ ఆదివాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ సంఘాలు కలిసి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ లు దాఖలు చేశాయి. రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని కొట్టివేయాలని అభ్యర్థించాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదంటూ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా... రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని... గిరిజన సంఘాల తరపున న్యాయవాది అల్లంకి రమేశ్ పేర్కొన్నారు. రిజర్వేషన్లలో 50 శాతం జనరల్ కాకుండా ఉండాలని, మిగిలిన 50 శాతం లోనే అన్ని కులాలు, మతాలకు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని... అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు.

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని.. వారి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు పేర్కొంటూ... జీవో నంబర్ 33 జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు పెంచిన రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రోస్టర్ జాబితాలో సర్దుబాటు చేసింది. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కేలా రోస్టర్ లో ఎస్టీ రిజర్వేషన్లు పొందుపరిచింది.

కాగా... తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు తమకు అందిందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరిందని కేంద్రం పేర్కొంది. అయితే.. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.