TSRTC Arunachalam: కరీంనగర్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు.. గురుపౌర్ణమి స్పెషల్ సర్వీసులు
TSRTC Arunachalam: గురు పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతోంది. కరీంనగర్ నుంచి రెండు ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నారు.
TSRTC Arunachalam: జూలై 21 గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్ళే భక్తుల కోసం టిజిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఒకటి వేములవాడ నుంచి మరొకటి గోదావరిఖని నుంచి అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్లు ప్రకటించారు. అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్ళే భక్తులు ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు బస్సులు 19న రాత్రి 7గంటలకు ప్రారంభమై కరీంనగర్ మీదుగా బయలుదేరుతాయని తెలిపారు.
గోదావరిఖని నుంచి సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సు 19న రాత్రి 7 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటల 45 నిమిషాలకు కరీంనగర్ కు చేరుకుంటుందన్నారు. కరీంనగర్ నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం, మహాలక్ష్మీ ఆలయం, వేలూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా 20న రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు.
అదే విధంగా వేములవాడ నుండి 19న రాత్రి 8 గంటలకు బయలు దేరే బస్సు కరీంనగర్ మీదుగా కాణిపాక వరసిద్ది వినాయక, శ్రీ మహాలక్ష్మీ ఆలయాలతో పాటు గోల్డెన్ టెంపుల్ లను దర్శించుకుని 20న రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని వివరించారు.
21న అరుణాచలం గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం అదేరోజు రాత్రి 5 గంటలకు తిరుగు ప్రయాణం కానున్న స్పెషల్ బస్సులు శక్తిపీఠం గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారు దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 22న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ మీదుగా వేములవాడ నుంచి బయలుదేరిన బస్సు వేములవాడ కు, గోదావరిఖని నుంచి బయలుదేరిన బస్సు గోదావరఖనికి చేరుకుంటుందని తెలిపారు.
బస్ చార్జీలు... ముందస్తు రిజర్వేషన్..
ప్రత్యేక బస్సులో గోదావరిఖని నుంచి పెద్దలకు 4850, పిల్లలకు 4050 రూ.లు, కరీంనగర్ నుంచి పెద్దలకు 4500, పిల్లలకు 3800 రూపాయలు చార్జి వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వేములవాడ నుండి అరుణాచలం వరకు పెద్దలకు 4500/- రూ.లు, పిల్లలకు 3800/- రూ.లు బస్ చార్జీ ఉంటుందన్నారు.
గోదావరిఖని బస్ సర్వీసుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in లో సర్వీసు నెంబర్ 69999 ను ఎంపిక చేసుకుని చేసుకోవాలని, వేములవాడ నుంచి బయలుదేరి బస్సు కోసం సర్వీస్ నెంబర్ 75555 ను ఎంపిక చేసుకొని ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)