Siddipet Murder: సిద్దిపేటలో దారుణం, మద్యం తాగవద్దని చెప్పినందుకు కన్నతండ్రిని పొడిచిన కుమారుడు
Siddipet Murder: సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు నిత్యం తాగి వచ్చి కుటుంబసభ్యులతో గొడవ పడుతున్నాడు. దీంతో మద్యం తాగవద్దని మందలించిన తండ్రిని ఆవేశంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
Siddipet Murder: మద్యం తాగొద్దని మందలించినందుకు తండ్రి తనయుడు దారుణంగా హతమార్చిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన పఠాన్ వలీఖాన్ (60),భార్య అఫ్జల్ బీ, ఒక కుమారుడు పఠాన్ షారుక్ (35), ఒక కూతురు ఉన్నారు.
వలీఖాన్ కలప వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కాగా కూతురిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. షారుక్ కు జకిరా బేగంతో పదమూడు ఏళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. షారుక్ కూడా తండ్రితో కలిసి కలప వ్యాపారం చేస్తూ ఉండేవాడు.
కత్తితో కడుపులో,భుజంపై,కాలుపై పొడవడంతో ....
ఈ క్రమంలో షారుక్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం మద్యం తాగి వచ్చి ఆ మత్తులో తరచూ తల్లితండ్రులతో గొడవ పడుతూ, భార్య,పిల్లలను కొట్టేవాడు. తల్లితండ్రులు తాగవద్దని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రతిరోజు మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు.
ఏ పని చేయకుండా తిరుగుతూ నిత్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని తల్లితండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం రాత్రి కూడా షారుక్ మళ్లీ మద్యం తాగి ఇంటికొచ్చాడు. దీంతో తండ్రి వలీఖాన్ మద్యం తాగవద్దని అలవాటు మార్చుకోమని,రోజు తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
ఈ గొడవతో తీవ్ర ఆవేశానికి లోనైనా షారుక్ రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో విచక్షణ రహితంగా తండ్రి కడుపులో,ఎడమ భుజం పైన మరియు ఎడమ కాలుపై పొడిచాడు. కుటుంబసభ్యుల అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి వలీఖాన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వారు కారులో గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
నిందితుడికి రిమాండ్ కు....
గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వలీఖాన్ భార్య అఫ్జల్ బీ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడు షారుక్ ను అదుపులోకి తీసుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు..
పోక్సో కేసులో యువకుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,50,000 జరిమానాను మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద విధించినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన మన్నే నర్సింలు ఫై నమోదైన పోక్సో కేసులో నిందితుడిని కోర్ట్ లో హాజరుపరిచారు.
కేసులో పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి .పి లక్ష్మీ శారద నిందితునికి కఠినమైన జీవిత ఖైదుతో పాటు రూ.1,50,000 జరిమానా విదించినారు. కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఎస్పి అభినందించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)