TS Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంపీలు - ప్రధాన పార్టీల వ్యూహం ఇదేనా..?
Telangana Assembly Elections : ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి క్లారిటీ రాగా… రేపోమాపో కాంగ్రెస్, బీజేపీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవటం లక్ష్యంగా.. ప్రధాన పార్టీలు తమ సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేయనున్నారు. అదేవిదంగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన స్వంత నియోజకవర్గం అయినా నల్గొండ సీటు నుంచి మరొకమారు పోటీలో ఉండబోతున్నానని సృష్టం చేశారు.
ఇక నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తిరిగి తన స్వంత నియోజకవర్గం అయినా హుజుర్ నగర్ నుంచి బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వీరి ముగ్గురి అభ్యర్థిత్వం పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అదేవిదంగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. అరవింద్ నిజామాబాద్ అర్బన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. బండి సంజయ్ వేములవాడ కానీ… కరీంనగర్ లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉండాలి అని ఆలోచనలో ఉన్నారు. ఎంపీ కిషన్ రెడ్డి కూడా అంబర్ పేట నుంచి పోటీ ఉండే అవకాశం ఉంది. అదే విధంగా నామినేషన్స్ వేసే సమయానికి… ఇంకా కొంతమంది ఎంపీలు కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎమ్మెల్యేగా ఓడి… ఎంపీగా గెలిచి
ఆశ్చర్యకరంగా, ఈ ఎంపీలు చాలామంది చివరిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నవారే. రేవంత్ రెడ్డి కొడంగల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో…మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేశారు. అదేవిదంగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి సారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లో ఓటమి చవిచూడటం జరిగింది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసి గెలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోదాడ, హుజుర్ నగర్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిసిన, నల్గొండ లోక్ సభ సీటులో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి అని తలచటంతో… ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, నల్గొండ నుండి పోటీ చేసి గెలిశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో…. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టడంతో ఆ పార్టీ మూడు ఎంపీ సీట్లు గెలవగలిగింది అని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
దుబ్బాక నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిసిన బిఆర్ఎస్ నాయకుడు సోలిపేట రామలింగా రెడ్డి 2020 లో ఆకస్మికంగా మరణించడంతో, ఈ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ తన సీటును కోల్పోయింది. ఆ పార్టీ రామలింగా రెడ్డి సతీమణి సుజాతని ఉపఎన్నికల బరిలో నిలపగా… బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ని పోటీలో నిలిపింది. సుజాతకి కానీ తన కుమారుడు సతీష్ రెడ్డి కి కానీ సరైన రాజకీయ అనుభవం లేకపోవడంతో… దుబ్బాక నియోజకవర్గ వాస్తవ్యుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ని పోటీలో నిలపాలి అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి.. మెదక్ లోక్ సభ నుంచి 2014, 2019 లో గెలుపొందారు.
ఇక బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి 2014, 2018 లో పోటీ చేసిన బండి సంజయ్, ఆ రెండు సార్లు ఓటమిపాలయ్యారు. తర్వాత వచ్చిన 2019 లోక్ సభ ఎన్నికలో మాత్రం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడైన బోయినపల్లి వినోద్ కుమార్ ని కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో ఓడించాడు. ఈ సారి సంజయ్ కరీంనగర్ నుంచి కానీ, వేములవాడ నుండి కానీ తన అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉంది. ఆ గెలుపు తర్వాతే… సంజయ్ రాజకీయ జీవితం పెద్ద మలుపు తిరిగింది. అదేవిధంగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా 2018 లో అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఓడిపోయాడు. తరవాత సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది కేంద్రమంత్రి అయ్యారు.
పార్టీల అవసరాలను బట్టి వీరిలో ఓడిపోయినా వాళ్ళు… మళ్ళీ ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యం కాబట్టి, వీరిలో ఎమ్మెల్యేగా గెలిసిన అభ్యర్థులతో రాజీనామా చెపించి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.