Minister Harish Rao : చంద్రబాబు ఐటీ ఐటీ అనేవారు, పాపం అరెస్టైనట్టున్నారు- మంత్రి హరీశ్ రావు-siddipet minister harish rao comments on chandrababu tells difference with cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Harish Rao : చంద్రబాబు ఐటీ ఐటీ అనేవారు, పాపం అరెస్టైనట్టున్నారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : చంద్రబాబు ఐటీ ఐటీ అనేవారు, పాపం అరెస్టైనట్టున్నారు- మంత్రి హరీశ్ రావు

Bandaru Satyaprasad HT Telugu
Sep 11, 2023 03:08 PM IST

Minister Harish Rao : చంద్రబాబు ఐటీ అని మాత్రమే అనేవారని, సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారని మంత్రి హరీశ్ రావు అన్నారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచలో నూతనంగా నిర్మించిన రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అదేవిధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1గా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ, ఐటీ అని మాత్రమే అనేవారని...నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా పెరిగిందన్నారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్న ఆయన.... తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఇవాళ 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు నిలయంగా రాష్ట్రం మారిందన్నారు.

పాపం చంద్రబాబు అరెస్టైనట్టున్నారు

సిద్ధిపేటలో రంగనాయక స్వామి బీఫార్మసీ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందన్నారు. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు....దాని గురించి మాట్లాడకూడదు కానీ గతంలో ఆయన ఐటీ ఐటీ అనేవారని, కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో ఐటీ, పల్లెల్లో వ్యవసాయం రెండూ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.

త్వరలో మహిళా యూనివర్సిటీ

ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇకపై అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతగానో కృషి చేసిందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... బీఫార్మసీ కాలేజీ అన్ని అనుమతులు పొంది ప్రారంభించుకోవడం వెనుక మంత్రి హరీశ్‌ రావు కృషి ఎంతో ఉందన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అయితే అని తెలంగాణకు సిద్దిపేట రోల్ మోడల్‌గా నిలిచిందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ త్వరలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొన్నారు.

Whats_app_banner