Siddipet News : సిద్దిపేటలో తీవ్ర విషాదం, అప్పు తీర్చమన్నందుకు తమ్ముడి దాడి- ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి అన్న సూసైడ్
Siddipet News : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు సోదరుడు దాడి చేయడంతో.. మనస్థాపం చెందిన అన్న, తన ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా సిద్దిపేటలోని చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా పలువురిని కంటతడి పెట్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన తేలు సత్యం (45) ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సత్యంకు ఆశ్వన్ నందన్ (7), కూతురు త్రివర్ణ (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందగా, కొన్నేళ్ల కిందట శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు.
భార్య శిరీష్ ,పిల్లలు అశ్వక్, త్రివర్ణ కలిసి సత్యం సిద్దిపేట పట్టణంలోని వాసవినగర్ లో నివసిస్తున్నాడు. సత్యం తన సోదరుడికి రూ.5.50 లక్షలు అప్పుగా ఉన్నాయి. ఇటీవల అనారోగ్యానికి గురైన సత్యం వైద్య ఖర్చుల కోసం సోదరుడికి ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే తమ్ముడి డబ్బు ఇవ్వకపోగా…సత్యంపై దాడి చేశాడు. దీంతో మనస్థాపం చెందిన సత్యం, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెరువులో మృతదేహాలను గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట టూటౌన్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూసిన కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి
దీపావళి నోములకు తల్లిగారింటికి కారులో బయల్దేరారు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వేముల రాజ్ కుమార్, భార్య వరలక్ష్మి, కూతురు అతిథి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వరలక్ష్మి పుట్టింట్లో దీపావళి నోములు ఉండడంతో వారిని తీసుకెళ్లడానికి ఆమె తమ్ముడు ఉదయ్ రామ్ వచ్చాడు. ఈ క్రమంలో వరలక్ష్మి, కూతురు అతిథి, తమ్ముడు ఉదయ్ రామ్ తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో కరీంనగర్ కు బయల్దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై వేగంగా కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరలక్ష్మి, ఆమె కూతురు అతిథి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయ్ రామ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అంబులెన్సులో కరీంనగర్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నోములకు వస్తూ రోడ్డు ప్రమాదంలో కూతురు, మనవరాలు మరణించడంతో తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం