Siddipet Police : ఈతకు వెళ్లే పిల్లల బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే: సిద్దిపేట సీపీ అనురాధ
Siddipet Police : సిద్ధిపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు నిండుగా ఉన్నాయి. ఈ సమయంలో పిల్లలను ఈతకు పంపించవద్దని సిద్దిపేట సీపీ సూచించారు. ఈత రాకపోవడం వలన ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదన్నారు.
జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు నీళ్లతో నిండుగా ఉన్నాయి.. సరదా కోసం పిల్లలు చెరువులలోకి, కుంటలల్లోకి ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. ఒంటరిగా, ఫ్రెండ్స్‌తో పిల్లలను ఈతకు పంపవద్దని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు సమయం కేటాయించి...
పిల్లలకు ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సిద్ధిపేట సీపీ స్పష్టం చేశారు. పిల్లలకు ఈతకు పంపించడం వలన, వారికీ నీటి లోతు తెలియకపోవడంతో అందులోకి జారి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోతే ఆ పిల్లల తల్లిదండ్రుల మనోవేదన ఎవ్వరూ తీర్చలేరని వివరించారు. తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి పిల్లలకు కొత్త విషయాలు నేర్పించాలని సూచించారు. పిల్లలను స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపొద్దని సూచించారు. ఒకవేళ పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లినా వారిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
చెరువులో పడి ఏడేళ్ల బాలుడు మృతి..
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి యాదగిరి కుటుంబసభ్యులతో కలిసి అత్తగారింట్లో దేవుడి పండగకు వెళ్లారు. యాదగిరి భార్య నవీన ముగ్గురు పిల్లలతో కలిసి ఆదివారం బట్టలు ఉతికేందుకు ఊర చెరువుకు వెళ్లారు. అక్కడ మానసిక వికలాంగుడైన కుమారుడు సాయి (7) కి స్నానం చేయించారు. అనంతరం అక్కడే ఆడుకోమని చెప్పి వారు బట్టలు ఉతికే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో సాయి చెరువు కట్ట వద్ద ఆడుకుంటూ ఉండగా.. ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో పడి మునిగిపోయాడు. ఇది గమనించిన తల్లి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. కుటుంబసభ్యులు చెరువులో గాలించగా... రెండు గంటల అనంతరం సాయి మృతదేహం లభ్యమైంది. అంతసేపు సంతోషంగా ఆడుకున్న కుమారుడు నీటిలో పడి మృతి చెందడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడి తల్లి నవీన ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)