Siddipet News : బతుకమ్మ వేడుకల్లో అపశృతి, చెరువులో ముగ్గురు గల్లంతు
Siddipet News : సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ పండుగ నాడే అపశృతి చోటుచేసుకుంది. చెరువులో చెత్తను తొలగించడానికి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు నీటిలో గల్లంతయ్యారు.
Siddipet News : సిద్దిపేట జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు చెరువుని సిద్ధం చేయటానికి చెత్తను తొలగించడానికి వచ్చిన ముగ్గురు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు చుట్టూ పట్టు గ్రామాల నుంచి గజ ఈతగాళ్లను రప్పించి వారికోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అంత వరకు బతుకమ్మలు పేరుస్తూ పండుగకు సిద్ధమవుతున్న ఊరు మొత్తం చెరువు దగ్గరికి చేరుకుంది. కొద్దిగంటలు చెరువులో వెతికిన గజ ఈతగాళ్లు, గిరిపల్లి భారతి (40), కర్రేముల్ల బాబు (25) మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా ఏళ్ళం యాదమ్మ (43) కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల మృతదేహాలు చూడగానే, ఊరు మొత్తం కన్నీరుమున్నీరు అయ్యింది. ముగ్గురు గ్రామ పంచాయతీలో పనిచేస్తూ, ఊరుకి ఏ విధంగా సేవచేశారో గ్రామస్తులంతా గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో బతుకమ్మ సంబరాలు మధ్యలోనే ఆపేశారు. జగదేవపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.