Medak Crime : మెదక్ జిల్లాలో వరుస హత్యల కలకలం.. ఒక్కరే చేస్తున్నారా? కారణం ఏంటీ?
Medak Crime : మెదక్ జిల్లాలో వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి. తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఒకే తరహా హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే.. రెండు హత్యలు ఒకేలా జరగడంతో.. ఒకరే ఈ మర్డర్లు చేస్తున్నారా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
మెదక్ జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా.. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక పద్మనాభ స్వామి దేవాలయం వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో మృతదేహాం కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. గత 24వ తేదీన స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇదే తరహాలో హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. తాజాగా అదే తరహాలో మరో హత్య జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు హత్యకు గురవుతున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. పది రోజుల కిందట జరిగిన హత్య కేసులో కూడా మృతుడు ఎవరు అనేది తెలియలేదు. తాజాగా హత్యకు గురైన మృతుడు కూడా ఎవరు అనేది తెలియలేదు.
9 రోజుల వ్యవధిలోనే ఒకే తరహాలో హత్యలు జరగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్, డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ వెంకటరాజా గౌడ్ పరిశీలించారు. అయితే.. ఈ రెండు ఘటనల్లో చనిపోయింది, చంపింది ఎవరో తెలియలేదు. వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒక్కరేనా..
రెండు హత్యలు ఒకేలా జరగడంతో.. చేసింది ఒక్కరేనా అనే చర్చ జరుగుతోంది. రెండు ఘటనల్లోనూ హత్య చేసి పెట్రోల్ పోసీ తగలబెట్టారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో పక్కా ప్లాన్‌తో హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా పటిష్టం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనలపై సీరియస్‌గా ఉన్నారు. నిందితులను కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు.