Etela Rajender : గజ్వేల్ లో ఓటమి భయంతో కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారు- ఈటల రాజేందర్
Etela Rajender : సీఎం కేసీఆర్ ఓటమి భయంతో గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారని ఈటల రాజేందర్ విమర్శించారు. గజ్వేల్ ప్రజలు నమ్మి ఓటేస్తే వారి భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు.
Etela Rajender : సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకరవర్గాల సమీక్ష సమావేశానికి బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమికి బయపడే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ ప్రజలు నమ్మి ఓటేస్తే భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారు. నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదని, గతంలో ఇచినవి గుంజుకున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతో కామారెడ్డికి
కేసీఆర్ ను గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దని కోరుతున్నానని ఈటల అన్నారు. గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తానని గతంలో చెప్పిన అదే మాట మీద నిలబడి ఉంటానని ఈటల అన్నారు. గజ్వేల్ ప్రజలు ఈ సారి కేసీఆర్ ఓటు వెయ్యం అంటున్నారన్నారు. గజ్వేల్ నుంచి ఓడిపోతానని భయపడి కామారెడ్డికి పారిపోతున్నారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం మందికి టికెట్ రాదని ప్రచారం జరిగిందని, కానీ భయపడి ఒకేసారి 115 మంది టికెట్లు ప్రకటించారన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్ లు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చే హామీలు బోలెడని కానీ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది బీఆర్ఎస్ లోకి గుంజుకున్నారన్నారు. కుక్కలాగా ఒర్రె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిల్లులను చేసినం అని ఓ ఎమ్మెల్సీ అంటున్నారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే
కాంగ్రెస్ వాళ్లను ఏమనకండి వాళ్లు మనవాల్లే అని ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మన కోవర్టులే మనమే గెలిపించి మన పార్టీలోకి తీసుకోస్తాం అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే ఇది ప్రజలు గమనించాలన్నారు. కుటుంబ పాలన వద్దంటే బీజేపీకి ఓటేయ్యాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ టిక్కెట్లు కోరుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈటల. ఏ నియోజకవర్గంలో ఎవరికి బాగా పట్టుందని అడిగి జిల్లా ముఖ్య నాయకుల అభిప్రాయాలను అడిగాడు. ప్రత్యర్థి పార్టీల బలాలు గురించి కూడా బీజేపీ నాయకులతో చర్చించారు. పార్టీ టికెట్లు ఆశిస్తున్న మెదక్ జిల్లా నాయకులు రాజేందర్ ను కలిసి మంతనాలు చేశారు.
రిపోర్టింగ్ : ఎస్.కవిత