Bhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం వీక్షణకు టిక్కెట్ల విక్రయం - వీఐపీ టిక్కెట్ ధర రూ.10 వేలు.!
Sita Rama Kalyanam at Bhadrachalam Tickets : భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే కల్యాణాన్ని వీక్షించేందుకు టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. వీఐపీ టిక్కెట్ విలువ రూ.10 వేలుగా నిర్ణయించారు.
Bhadrachalam Kalyanam 2024: దక్షిణ భారతదేశ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఆ సీతారాములు నడయాడిన చారిత్రిక నేపథ్యం కలిగిన ప్రాంతంలో నిర్మితమైన దేవాలయం కావడంతో ఇక్కడ జరిపే శ్రీరామ కల్యాణానికి విశిష్టత నెలకొంది. తెలంగాణలో ప్రాముఖ్యం కలిగిన దేవాలయాల్లో భద్రాద్రి రామాలయం మొదటిది కావడంతో ప్రతియేటా ఇక్కడ జరిగే కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 17వ తేదీన వైభవంగా జరిగే ఉత్సవానికి ఇప్పటికే గోటి తలంబ్రాలు సిద్ధమవుతుండగా భక్తుల వీక్షణకు కావాల్సిన దర్శన టిక్కెట్లను ఆలయ నిర్వాహకులు నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు.
వీఐపీ టిక్కెట్ రూ.10 వేలు..
సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని(Bhadrachalam Kalyanam) దగ్గరి నుంచి వీక్షించాలని కోరుకునే భక్తులకు దేవాలయ కమిటీ టిక్కెట్ ను నిర్ణయించింది. రూ.10 వేలు, రూ.5 వేలుగా ఈ టిక్కెట్ రుసుమును నిర్ణయించారు. మిథుల మండపానికి అత్యంత సమీపంలోనే ఈ టిక్కెట్ల వీక్షకులు కూర్చునే అవకాశాన్ని కల్పించారు. అలాగే శ్రీరామ నవమి రోజున రాముని కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్లైన్ తో పాటు ప్రత్యేక కౌంటర్లలో కూడా టికెట్లను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఇప్పటికే ప్రకటించారు. రూ. 7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువ కలిగిన టికెట్లను ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉంచారు. మిథిలా మండపానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీట్లను విలువైన సెక్టార్లను ఉద్దేశించి ఏర్పాటు చేశారు. వీటికి టిక్కెట్లను (రూ.10 వేలు, రూ.5 వేలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నుంచి విక్రయిస్తున్నారు. 17న జరిగే కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు.
తపాలా, ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు..
కళ్యాణ మహోత్సవంలో సీతారాముల (Bhadrachalam Kalyanam)ఉత్సవ విగ్రహాల మీదుగా పోసిన తలంబ్రాలను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే అలాంటి తలంబ్రాలు మన ఇంటి ముంగిటికే వస్తే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. భక్తుల ఇంటి వద్దకే గోటి తలంబ్రాలను పంపిస్తామని ఆర్టీసీ, తపాలా శాఖ ప్రకటించాయి. ఈ సౌకర్యం కోసం ఆర్టీసీ ద్వారా అయితే ఈ నెల 18 వరకు బుక్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో 90 లాజిస్టిక్ కేంద్రాల్లో బుకింగ్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. అలాగే దేవాదాయ శాఖతో కలిసి తపాలా విభాగం కూడా కల్యాణ తలంబ్రాలను పంపే ఏర్పాట్లు చేసింది. అంతరాలయ అర్చన-కల్యాణ తలంబ్రాలకు రూ.450 చెల్లించి ఈ నెల 15లోపు, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చెల్లించి ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాలకు వెళ్లి చిరునామా ఇచ్చి బుక్ చేసుకోవచ్చని తపాలా శాఖ ప్రకటించింది.