Singareni Workers Bonus : సింగరేణి కార్మికులకు దసరా కానుక... బోనస్‌గా రూ.711 కోట్లు-rs 711 cr bonus for singareni employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Workers Bonus : సింగరేణి కార్మికులకు దసరా కానుక... బోనస్‌గా రూ.711 కోట్లు

Singareni Workers Bonus : సింగరేణి కార్మికులకు దసరా కానుక... బోనస్‌గా రూ.711 కోట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 05, 2023 04:27 PM IST

Bonus for Singareni Employees: సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ సర్కార్. లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సింగరేణి కార్మికులకు దసరా కానుక
సింగరేణి కార్మికులకు దసరా కానుక

Bonus For Singareni Employees: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను అందజేయనున్నారు. ఈ డబ్బులను ఈ నెల 16 వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విదంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయల లో 32 శాతం లాభాల బోనసు ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన తెలిపారు.

yearly horoscope entry point

సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్ తన కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్. బలరామ్ గురువారం సర్క్యులర్ ను జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...

దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీ లో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్ గా కార్మికులకు పంచడం జరుగుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా బోనస్ ను ప్రకటిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాక పూర్వం 2013 -14లో ఇది 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని పెంచుతూ 2014-15 లో 21 శాతం, 2015-16లో 23 శాతం (245.21 కోట్లు) 2016-17లో 25 శాతం (98.85 కోట్లు), 2017-18 లో27 శాతం (327.44 కోట్లు), 2018 19 లో 28 శాతం (493.82 కోట్లు), 2020-21 లో29 శాతం (79.07 కోట్లు), 2021-22లో 30 శాతం (368.11 కోట్లు) ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు 2222 కోట్ల రూపాయల లో 32 శాతం అనగా రూ.711.18 కోట్ల ను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించాలని ఇటీవలే ఆదేశించారు. అలాగే దసరా పండుగకు ముందే ఇది కార్మికుల చేతికి అందేలా చూడాలని ఇటీవల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం పూర్తి ఏర్పాట్లను చేసింది.

ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ లాభం..

గత ఆర్థిక సంవత్సరంలో విధులు నిర్వహించిన 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు 32 శాతం వాటాగా కేటాయించిన రూ.711.18 కోట్ల రూపాయలను వారు పనిచేస్తున్న గని మరియు శాఖ ఆధారంగా లాభాల బోనస్ ను లెక్కించి చెల్లించనున్నారు. ప్రధానంగా ఎక్కువ హాజరు ఉన్నవారికి ఎక్కువ మొత్తంలో లాభాల బోనస్ దక్కనుంది. భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు 749.58 రూపాయల చొప్పున వారు పని చేసిన మొత్తం దినాలకు లెక్కగట్టి లాభాల బోన‌స్‌ చెల్లిస్తారు. ఓపెన్ కాస్ట్ గనులు , ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రూ.627.41 చొప్పున చెల్లిస్తారు. వీరు కాక మిగిలిన విభాగాలు, శాఖల్లో పనిచేసే వారికి రోజుకు రూ.578.69 ల చొప్పున వారు పనిచేసిన దినాలకు లెక్క కట్టి బోనస్ చెల్లిస్తారు. మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో కార్మికునికి రూ 1,53,516 వరకు లాభాల బోనస్ పొందే అవకాశం ఉంది.

త్వరలో దీపావళి బోనస్ కూడా…

ఇదిలా ఉంటే దీపావళి బోనస్ గా పేర్కొనే (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్ బోనస్ ను) కూడా ఆ పండుగకు ముందే చెల్లించనున్నట్లు ఛైర్మన్ మరియు ఎండి ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఇది కూడా సుమారు 300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి గ‌త ఏడాది చెల్లించిన 76,500 క‌న్నా ఇంకా ఎక్కువ పొందే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటీవలనే చెల్లించిన 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ 1450 కోట్ల రూపాయ‌ల‌లో సగటున ఒక్కో కార్మికునికి 3.65 లక్ష రూపాయల వరకు అందాయి. ఈ విధంగా వేజ్ బోర్డు ఎరియ‌ర్స్‌, లాభాల బోనస్ , దీపావళి బోనస్ లు కలిపితే సగటున ప్రతి కార్మికుడి ఖాతాలో దాదాపు 6 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో తమ క‌ష్టార్జితం చేతికంద‌డం ఇదే ప్ర‌థ‌మం క‌నుక దీనిని వృథా చేసుకోకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం