Telangana Tourism : ఈ పర్యాటక ప్రదేశాలకు ఇప్పట్లో వెళ్లొద్దు.. టూరిస్టులకు అధికారుల సూచన!-restrictions in popular tourist areas of telangana due to heavy rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tourism : ఈ పర్యాటక ప్రదేశాలకు ఇప్పట్లో వెళ్లొద్దు.. టూరిస్టులకు అధికారుల సూచన!

Telangana Tourism : ఈ పర్యాటక ప్రదేశాలకు ఇప్పట్లో వెళ్లొద్దు.. టూరిస్టులకు అధికారుల సూచన!

Basani Shiva Kumar HT Telugu
Sep 05, 2024 11:07 AM IST

Telangana Tourism : తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో కురుస్తున్నాయి. భారీ వర్షాల ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొన్ని రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని చెబుతున్నారు.

వాజేడు జలపాతం
వాజేడు జలపాతం (Telangana Tourism )

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల ప్రభావం తెలంగాణ టూరిజంపై పడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొన్ని రోజులు పర్యాకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అందరూ సహకరించాలి..

ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు పర్యాటకులు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క- సారలమ్మ దేవాలయానికి రావొద్దని సూచించారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులు, ఇతర జిల్లాల సందర్శకులు సహకరించాలని కోరారు.

తాత్కాలికంగా నిషేధం..

ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ములుగు జిల్లా కలెక్టర్ వివరించారు. అటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను ఉంచారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. చేపల వేటపై తాత్కాలికంగా నిషేధం విధించారు. మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టడాన్ని నిషేధించారు.

పాకాల సరస్సు వద్ద ఆంక్షలు..

ఇటు వరంగల్ జిల్లా పాకాల సరస్సు వద్ద కూడా అధికారులు ఆంక్షలు విధించారు. పాకాల మత్తడి పోస్తున్న కారణంగా అక్కడికి అనుమతించడం లేదు. ఇటు నర్సంపేట నుంచి పాకాల వెళ్లే మార్గంలో అశోక్ నగర్ దాటిన తర్వాత వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. కొత్తగూడెం, గుంజేడు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉధృతంగా మాధన్నపేట వాగు..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట చెరువు మత్తడి పోస్తోంది. దీంతో మాధన్నపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో.. మత్తడి వద్దకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇటు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. నర్సంపేట- మాధన్నపేట, నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.