TSRTC Reservation: టిఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన రిజర్వేషన్ ఛార్జీలు..-reduced reservation charges in telangana rtc buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Reservation: టిఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన రిజర్వేషన్ ఛార్జీలు..

TSRTC Reservation: టిఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన రిజర్వేషన్ ఛార్జీలు..

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 11:30 AM IST

TSRTC Reservation: తెలంగాణ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణాలను ప్రోత్సహించడానికి ఆర్టీసీ కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ముందస్తు రిజర్వేషన్ల సంఖ్యను పెంచడానికి రిజర్వేషన్ ఛార్జీల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీల తగ్గింపు
తెలంగాణ ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీల తగ్గింపు

TSRTC Reservation: ఆర్టీసి బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై భారం త‌గ్గించ‌డానికి ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సవరించింది. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రిజర్వేషన్ చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌పెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో 350 కిలో మీటర్లలోపు ప్రయాణానికి రిజర్వేషన్ ఛార్జీ రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం రూ.30వసూలు చేస్తారు.

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మొదటి నుంచి ముందస్తుే రిజర్వేషన్‌‌కు మంచి స్పందన ఉందని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 15 వేల వరకు ముంద‌స్తుగా ప్ర‌యాణికులు టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారని, వారికి కొంత ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను తగ్గించామ‌ని చెప్పారు. ఆర్టీసి కల్పించిన సదుపాయాన్ని ప్రయాణికులంతా ఉపయోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు.

తెలంగాణలో కరోనాకు ముందు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 45-50 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 32 లక్షలుగా ఉంది. పాస్‌లతో ప్రయాణించే విద్యార్థులు దాదాపు 10 లక్షలు కలిపినా మొత్తం సంఖ్య 42 లక్షలు దాటడం లేదు. గతంలో మాదిరిగి ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు ఆర్టీసి అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీలో కొత్త బస్సులు….

ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు టీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు ప్రారంభించింది. బస్సుల కొనుగోలు కోసం ఓ బ్యాంకు నుంచి రూ.350 కోట్ల రుణం మంజూరు కావడంతో వాటితో వెయ్యి బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీ టెండర్లు కూడా పిలిచింది. మంగళవారం టెండర్లు తెరవనున్నారు. కొత్త బస్సుల్లో - 416 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 300కు పైగా పల్లెవెలుగు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. మిగిలిన వాటిలో రాజధాని సర్వీసులతో పాటు ఇతర ఏసీ సర్వీసులు ఉండనున్నాయి.

ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల సంఖ్యతో ప్రయాణికులు తగ్గుతున్నారనే అభిప్రాయం ఉంది. సాంకేతిక గడువును బట్టి వీటిని పక్కన పెడుతున్నారు. బస్సుల సంఖ్య తగ్గడంతో దీంతో పలు రూట్లలో బస్సు సర్వీసులు ఆగి పోతున్నాయి. ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలకు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

మరోవైపు అద్దె పద్ధతిలో 1,560 ఎలక్ట్రిక్‌ బస్సుల్లో కొన్నింటిని ఇప్పటికే పలు మార్గాల్లో ప్రవేశపెట్టారు. 2023-24లో 957 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 2025 మార్చి నాటికి మొత్తం బస్సుల్ని ప ప్రవేశపెట్టాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో మరో 50 ఎలక్ట్రిక్‌ అద్దె బస్సులు రానున్నాయి. జులై తొలివారంలో 25 బస్సుల ప్రారంభోత్సవానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. మరో 20 రోజులుకు మిగతా 25 బస్సులు వస్తాయి. వీటిలో ఎయిర్‌పోర్టుకు 20, ఐటీ కారిడార్‌కు 30 ఏసీ బస్సులు నడపాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.

నిజాంపేట, బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌కు, అదేవిధంగా వనస్థలిపురం నుంచి వేవ్‌రాక్‌ వరకు అద్దె ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో గతంలో డబుల్‌డెక్కర్‌ బస్సులు నడిపిన ఆర్టీసీ.. తాజాగా 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులనూ వివిధ మార్గాల్లో నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

Whats_app_banner