Hyd Murder Mystery: హైదరాబాద్‌లో వీడిన మహిళ మర్డర్ మిస్టరీ, ఇంటికి పిలిచి ఘాతుకం-real estate businessman killed a woman to pay a debt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Murder Mystery: హైదరాబాద్‌లో వీడిన మహిళ మర్డర్ మిస్టరీ, ఇంటికి పిలిచి ఘాతుకం

Hyd Murder Mystery: హైదరాబాద్‌లో వీడిన మహిళ మర్డర్ మిస్టరీ, ఇంటికి పిలిచి ఘాతుకం

HT Telugu Desk HT Telugu
Jun 07, 2024 11:51 AM IST

Hyd Murder Mystery: హైదరాబాద్ మేడిపల్లి మహిళా హత్య మిస్టరీ వీడింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమన్నందుకు ఇంటికి పిలిపించి మరీ హత్యకు పాల్పడినట్టు గుర్తించారు.

వీడిన రియల్టర్ ఇంట్లో మహిళ మృతదేహం మిస్టరీ
వీడిన రియల్టర్ ఇంట్లో మహిళ మృతదేహం మిస్టరీ

Hyd Murder Mystery: హైదరాబాద్‌ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు చేధించారు. ఈనెల 1వ తేదిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడమే ఈ హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు.

గురువారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న మహిళా ఉషారాణి (63)కి, నిందితుడు సత్య నారాయణ (63) తో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయం ఏర్పడింది. మృతురాలు ఉషారాణి కూతురు విదేశాల్లో ఉండగా ఆమె ఒక్కతే స్థానికంగా నివాసం ఉంటుంది.

రెండు నెలల క్రితం ప్లాట్స్ తీసుకుంటామని ఉషారాణి..సత్యనారాయణతో చెప్పగా అతను వివిధ ప్లాట్స్ చూపించాడు. ఉషారాణి వద్ద డబ్బు ఉందని గ్రహించిన సత్యనారాయణ లక్ష రూపాయలు కావాలని, నెలలోపు ఇస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా డబులు తిరిగి ఇవ్వాలని ఉషారాణి అడుగుతూ ఉండగా, రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.

ఈనెల 1వ తేదిన డబ్బులు ఇస్తానని, ఒంటరిగా తన ఇంటికి రావాలని ఆమెతో చెప్పగా ఆమె సత్యనారాయణ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే చార్జింగ్ వైర్ తో ఆమె మెడకు బిగించి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఉప్పల్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సిఐ గోవింద రెడ్డి తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణంగా హత్యకు గురైన ఘటన జిల్లాలోని కడ్తల్ మండల పరిధిలో చోటు చేసుకొంది. మృతులు ఇద్దరిని కడ్తాల్ మండలం, గోవిందయ్య పల్లి గ్రామానికి చెందిన శేషగిరి శివ (24),గుండేమని శివ (29) లుగా గుర్తించారు. ఈ హత్యలు బుధవారం రాత్రి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సప్‌ గ్రూప్‌లో ఫోటోలను తొలగించడంతో ఏర్పడిన వివాదంతో హత్యలు జరిగినట్టు గుర్తించారు. పథకం ప్రకారం మద్యం సేవించేందుకు పిలిపించి ప్రత్యర్థులు హత్యకు పాల్పడ్డారు.

కాజీపేట లో యువతి దారుణ హత్య

వరంగల్ జిల్లా కాజీపేట శివారు ప్రాంతంలోని అమ్మవారిపేట సాయి నాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి పై దుండగులు బండరాళ్లు తలపై వేసి కిరాతకంగా చంపేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుంచి బట్టిపల్లి వైపు వెళ్లే దారిలో సాయినాథ్ ఎస్టేట్ లో సుమారు 30 సంవత్సరాలు ఉన్న ఓ యువతి రక్తపు మడుగులో మరణించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

Whats_app_banner