Ram Navami Special | వనవాసంలో శ్రీ రాముడు ఉన్న ఈ ప్రాంతం గురించి మీకు పెద్దగా తెలియకపోవచ్చు
చుట్టూ ఆహ్లాదరపరిచే ప్రకృతి. కొండ ఎక్కితే.. కనుచూపు మేర పచ్చదనం. శ్రీరాముడు నడయాడిన నేలా. వందల ఔషద మెుక్కలకు ఆవాసం.. ఇలా ఎంత చెప్పినా ఆ ప్రదేశం గురించి తక్కువే. అదే రామగిరి ఖిల్లా. ఈ ప్రాంతం గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
రామగిరి ఖిల్లా.. అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం.. కొండ ఎక్కితే.. ప్రశాంతమైన గాలి. సీతారాములు కుటీరం ఏర్పరుచుకుని.. కొన్ని రోజులు ఉన్న ప్రదేశం. ఆ ప్రాంతంలోని ప్రజలకు తప్ప.. బయటి వారికి ఈ ప్రాంతం గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. రామగిరి ఖిల్లా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని బేగంపేటకు దగ్గరగా ఉంటుంది. సీతారాములు.. ఈ ప్రాంతంలో.. కొన్నిరోజులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది.
వనవాసంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని ఉన్నారని చరిత్రకారులు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పేందుకు కొన్ని ఆనవాళ్లు కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఖిల్లాపై బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలను కూడా ఉంది. రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రాంగానూ ఆ ప్రాంతంలో పేరుంది. 200 రకాలకు పైగా వనమూలికలను ఈ ఖిల్లాలో ఉన్నాయి.
రామగిరి ఖిల్లా అంతర్భాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు చూడొచ్చు.
రామగిరిపై కోటను క్రీ.శ ఒకటో శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శాతవాహనాలు, పులోమావి వంశస్థులు పాలించినట్లు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఖిల్లాను కాకతీయ ప్రతాపరుద్రుడు, గురిజాల కమ్మవంశీయులు, బహమనీ సుల్తానులు, రెడ్డిరాజులు, మొఘలులు, గోల్కొండ నవాబులు, నిజాం నవాబులు పాలించారు. అయితే కాకతీయలు కాలంలో ఇక్కడ శిల్ప సంపదపై దృష్టి పెట్టారని చెబుతారు.
అంతేకాదు.. ఆదిమ మానవుల చిత్రాలు బండపై ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయి కదా. కానీ రామగిరి ఖిల్లా పై మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ పడగ రాయి కింద ఆదిమ మానవులు వేసిన ఎరుపు, తెలుపు రంగుల చిత్రాలతో పాటుగా నలుపు రంగుతో వేసిన బాణం గుర్తులు ఉన్నాయి. ఎత్తైన పడగ రాయి కింద శివలింగంగా ఉపయోగించిన నల్లని రాయి ఉంది. ఇవన్ని క్రీ.పూ 10 వేల ఏళ్ల క్రితం నాటివని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో రామగిరి ఖిల్లా చుట్టూ 9 ఫిరంగులు, 40 తోపులు ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ ఒక ఫిరంగి ఉంది.
పౌరాణికంలోనూ రామగిరి ఖిల్లా గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రామాయణంలో రాముడు వనవాస సమయంలో ఇక్కడ కొద్ది రోజులపాటు కుటీరం ఏర్పరుచుకొని నివసించినట్లు చెబుతారు. తపస్సు ను ఆచరించి శివలింగాన్ని ప్రతిష్టించినట్లు అంటుంటారు. ఈ ప్రదేశంలో సీతారామలక్ష్మణులు సంచరించినట్లు ఆనవాళ్లు పర్యాటకులకు దర్శనమిస్తాయి. రాముడు నడయాడిన నేల కాబట్టే రామగిరి ఖిల్లాకు పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇక్కడ శ్రీరాముడు విగ్రహం ఉన్న చోట 1000 మంది తలదాచుకునేంత విశాల మైదానం ఉంది.
శ్రావణమాసంలోనే.. రామగిరి ఖిల్లాను ఎక్కువగా సందర్శిస్తారు. శ్రావణ మాసంలో.. సందడి మొదలవుతుంది. వర్షాకాలం లో పచ్చదనం పరుచుకుంటోంది ఈ ఖిల్లా. ప్రకృతి అందాలను చూస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు. కానీ కొండపైకి వెళ్లాలి అంటే నడిచే వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి 215 కి. మీ ల దూరంలో ఉంటుంది. క్యాబ్, టాక్సీ లలో రావొచ్చు. ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా రావొచ్చు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రామగిరి ఖిల్లా కు 20 కి. మీ ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ న్యూఢిల్లీ - కాజీపేట రైలు ఉంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో దిగితే.. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చు. కరీంనగర్ నుండి మంథని - కాళేశ్వరం వెళ్లే దారిలో రామగిరి ఖిల్లా ఉంది. కమాన్ పూర్ మండలంలోని నాగపల్లె బేంగంపేట క్రాస్ రోడ్డు నుంచి బేగంపేట గ్రామం మీదుగా 2 కి. మీ. దూరం కాలినడకన నడిచి ఖిల్లాకు రావొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్