Kodangal Constituency : కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ - సీఎం రేవంత్ కీలక ప్రకటన
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పుకొచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏకంగా లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ పై కూడా దాడి జరిగింది. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఫార్మా సిటీ కాదు - సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ – లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని సచివాలయంలో శనివారం కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని గుర్తుచేశారు.
కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఇబ్బంది పెట్టాలని కాదు...
"2009 నుండి కొడంగల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అత్యంత వెనకబడిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉంది. నా ప్రజలకు మేలు చేయాలన్న తపన, తలంపే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను. అటువంటి ఆలోచన కలలో కూడా చేయనని వామపక్ష నేతలతో నా ఆలోచన పంచుకున్నాను" అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ప్రజా పాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష:
ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా పాలన విజయోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.
ప్రజా పాలన విజయోత్సవాలు - సీఎం రేవంత్ కీలక సూచనలు:
- ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
- డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలి. ఆ వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించాలి.
- డిసెంబర్ 1 వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలి. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలి.
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి.
- పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలి. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలి.
- రాష్ట్ర మంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలి.
- డిసెంబర్ 9 న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలి.
- ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి... లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలి.
- డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలి.
సంబంధిత కథనం