CM Revanth Reddy : ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఇటీవలి కాలంలో వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
"ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలి. ఈ సదస్సులో రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. రైతుల్లో అవగాహన పెంచడానికి వీలుగా సదస్సును ఒకరోజు కాకుండా 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా స్టాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలి. తద్వారా రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు ఉపయోగపడాలి"- సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కొన్నిచోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో నమోదైన పేర్లలో తప్పులు, కుటుంబాల నిర్ధారణ వంటి కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు నివేదికను అందించారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు
హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు అంశంపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం నీటి పారుదల శాఖ, జలమండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంతమేరకు నీటిని తరలించాలి, ఎంత ఖర్చవుతుందన్న విషయాలపై పూర్తి అధ్యయనం జరగాలని ఆదేశించారు. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
సంబంధిత కథనం