Rahul Gandhi: ఎవరితో పొత్తు ఉండదు.. టీఆర్ఎస్ ను ఓడించి తీరుతాం - రాహుల్ గాంధీ-rahul gandhi slams trs govt over warangal rythu sangharshana sabha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi: ఎవరితో పొత్తు ఉండదు.. టీఆర్ఎస్ ను ఓడించి తీరుతాం - రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎవరితో పొత్తు ఉండదు.. టీఆర్ఎస్ ను ఓడించి తీరుతాం - రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu
May 06, 2022 08:19 PM IST

వరంగల్ వేదికగా తలపెట్టిన 'రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తామని స్పష్టం చేశారు.

వరంగల్ సభలోరాహుల్ గాంధీ
వరంగల్ సభలోరాహుల్ గాంధీ (twitter)

తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం సాకారమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు తీరలేదన్న రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రజల కలలను ఈ సర్కార్‌ నెరవేర్చలేదని విమర్శించారు. ఇక్కడి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం లేదని ఒక రాజులా పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.  

తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగలేదని రాహుల్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్‌ ఎంతో పోరాటం చేసిందని.. ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. నాడు కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామని.. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు.

రాహుల్ ప్రసంగం ఇదే..

"టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనే నేతలు.. ఆ పార్టీలోకి వెళ్లొచ్చు. మేం ఎవరితో పొత్తు పెట్టుకోం. ఈ పొత్తుపై ఎవరు మాట్లాడిన బహిష్కరిస్తాం. ఎంత పెద్దవారైనా వేటు తప్పదు. అలాంటి నేతలు మా పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తే సహించేది లేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తీరుతాం. తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు..? తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో పొత్తు ఉండదు. ఎన్నికల సమయంలో టిక్కెట్ల అంశం వచ్చే వరకు.. ప్రజా సమస్యలపై పోరాటం చేయని వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ప్రజల్లో ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తాం. బలమైన కోరికతో తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారు. ఏ అంశంపై అయినా సరే మీ తరుపున పోరాడేందుకు నేను ముందుంటాను. ఇది ఒక్కరి పోరాటం కాదు.. అన్ని వర్గాల పోరాటంలో కాంగ్రెస్ ముందుంటుంది. టీఆర్ఎస్, బీజేపీతో సంబంధం ఉన్నవాళ్లు ఆ పార్టీలోకి వెళ్లొచ్చు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉంది. రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ప్రకటించింది. బీజేపీకి తెలుసు.. తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని. కానీ కేంద్రంలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా.. టీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇస్తోంది. తెలంగాణ సర్కార్ ఎంతో అవినీతి చేసినా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపటం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలి. రైతులకు భరోసా ఇచ్చేందుకు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా రైతులతో నడుస్తుందనే విషయాన్ని ఈ బహిరంగ సభ ద్వారా చెబుతున్నాను. ఆదివాసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తాం. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు. కానీ వారు మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. రైతులు, యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కలిసి తెలంగాణ కలలను నేరవేర్చటానికి మీతో కలిసి ప్రయాణం చేస్తుంది. సభకు వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు" అని రాహుల్ గాంధీ చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం