Poster war in munugode: మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్ వార్..-poster war creates stir in munugode bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Poster War In Munugode: మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్ వార్..

Poster war in munugode: మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్ వార్..

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 12:55 PM IST

Poster war in munugode: మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్ వార్ నడుస్తోంది. ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి పోస్టర్లు వేస్తూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్, బూర నర్సయ్య గౌడ్
మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్, బూర నర్సయ్య గౌడ్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారశైలి విస్తుగొలుపుతోంది. ఒకవైపు గతంలో ఎన్నడూ లేనంతగా నగదు పట్టివేత జరుగుతుండగా.. మరోవైపు పోస్టర్ల వార్ కలకలం రేపుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాయి. ఈసారి ప్రధానంగా పోస్టర్ల వార్ జనంలో చర్చనీయాంశమైంది.

‘లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ కుట్ర.. రాజగోపాల్ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్ర.. మేం బానిసలం కాదు.. మీలా అమ్ముడుపోయే వాళ్లం కాదు.. జై సేవాలాల్, జై భీమ్, జై లంబాడీ.. లంబాడ హక్కుల పోరాట సమితి..’ అంటూ ఓ పోస్టర్ వెలిసింది.

‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరు పోసపోకండి.. ఇట్లు హుజురాబాద్ ప్రజలు.. దుబ్బాక ప్రజలు..’ అంటూ మరికొన్ని పోస్టర్లు కలకలం రేపాయి.

‘కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన ద్రోహి..’ అంటూ వెలిసిన పోస్టర్లు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం కలిగించాయి. ఈనేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఆయా పోస్టర్లను తొలగించడం ప్రారంభించారు. వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తుంటే అడ్డుకున్నారు. అంతేకాకుండా మండల కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపాయి. ఎన్నికల అధికారులు కూడా స్పందించి అన్ని రకాల పోస్టర్లను తొలగించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.

నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ప్రజల పేరిట బీజేపీ కూడా పోస్టర్లు వేయడం ప్రారంభించింది. అలాగే తమకు అనుకూలంగా పోస్టర్లు కూడా వేసింది. ‘ఫలిస్తున్న రాజీనామా.. సాకారం అవుతున్న కలలు.. ధన్యవాదాలు రాజగోపాల్ రెడ్డి..’ అంటూ కొన్ని పోస్టర్లు వెలిశాయి.

పోస్టర్ల యుద్ధంలో కాంగ్రెస్ కూడా పాత్ర పోషిస్తోందని బీజేపీ అనుమానిస్తోంది. తొలుత మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఫోటోతో కాంట్రాక్ట్ పే అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు కాంగ్రెస్, దాని అనుబంధ సంస్థలు అతికించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ పోస్టర్లు బీజేపీ శ్రేణులను దిగ్భ్రాంతికి లోను చేశాయి.

ఇక ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోవద్దంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పోస్టర్లు అతికిస్తున్నాయి. అమ్ముకుంటే బతికి ఉన్నా.. శవానితో సమానం అంటూ ఆ పోస్టర్లలో రాశాయి.

ఇటీవల పలు పార్టీల నేతలు వలసల పర్వానికి తెరతీశారు. ఒక పార్టీ నేత మరో పార్టీకి వెళితే.. ఆ ప్రభావాన్ని తిప్పికొట్టేందుకు నలుగురైదుగురు ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి ముఖ్య నేత బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరగా.. ఈ పరిణామానికి ధీటుగా బీజేపీ నుంచి శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్‌లను టీఆర్ఎస్ తమ పార్టీలోకి ఆకర్షించింది.

మరోవైపు పార్టీల ప్రచారం కూడా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ స్థానం పట్టుజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ప్రచారానికి వచ్చిన నేతలపై ప్రత్యర్థులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగలు తగిలాయి. కాంట్రాక్టులకు అమ్ముడుపోయారంటూ దాడులకు దిగారు. మరో వారం రోజుల్లో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో ఇంకెన్ని గొడవలు జరుగుతాయోనన్న టెన్షన్ మొదలైంది.

రానున్న వారం రోజుల్లో మునుగోడు ఉప ఎన్నికలో డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ వెల్లువెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పోలీసులు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఎత్తుగడలు, ఉద్రికత్తలు ప్రధాన పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

IPL_Entry_Point