Narcotics Seize: హైదరాబాద్‌లో భారీగా హెరాయిన్ స్వాధీనం
Narcotics Seize: రాజస్థాన్ నుండి హెరాయిన్ తీసుకు వచ్చి ఎన్వలప్ కవర్లలో నగరంలో విక్రయిస్తున్న ముఠాను ఎల్ బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Narcotics Seize: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న హెరాయిన్ విక్రయాలను పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి తీసుకు వచ్చిన హెరాయిన్‌ను చిన్నచిన్న పాకెట్లలో విక్రయిస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. నిందితుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎల్ బీ నగర్ సీపీ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బన్వర్ లాల్ ,విష్ణు తో పాటు మరో ఇద్దరు మైనర్ యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొదట మాదకద్రవ్యాలకు అలవాటు పడి వాటిని విక్రయించడం మొదలు పెట్టారు.
రాజస్థాన్ లో తెలిసిన కొందరు వ్యక్తుల నుండి వీరు హెరాయిన్ కొనుగోలు చేసి కొంత సొంతానికి వాడుకొని మరి కొంత అవసరమైన వారికి విక్రయిస్తున్నారు.అయితే గత కొన్ని రోజులుగా వీరు హైదరాబాద్‌లో హెరాయిన్ ను విక్రయిస్తూ వచ్చారు. హెరాయిన్ తరలింపు కోసం ఈ ముఠా బైక్ సర్వీసులను వాడుకుంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్ బీ నగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం మీర్‌పేటలోని ఎంబీఆర్ కాలనీలో ఈ నలుగురు హెరాయిన్ విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే 80 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ సరఫరాకు ఉపయోగిస్తున్న బైక్ సర్వీసుల పై దృష్టి పెట్టమని, ఎన్డిపిఎస్ యాక్ట్ కింద నమోదైన వారిని బైక్ సర్వీసులను ఉపయోగించుకోనియకుండా ఆయా బైక్ సర్వీస్ అప్ నిర్వాహకులకు సూచిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు.
బోరబండా లో 1.7 కిలోల గంజాయి సీజ్
ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డిసిపి నిఖిత పంత్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ దాస్ హైటెక్ సిటీలోని ఓ హోటల్ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు.
సరోజ్ కుమార్ దాస్ కు ఆర్థిక ఇబ్బందులు ఉండటం తో సులభంగా డబ్బు సంపాదించేందుకు అతని స్నేహితుడు సయ్యద్ ఫయాజ్ తో కలిసి డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టాడు. ఒడిశా రాష్ట్రంలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయించి డబ్బు సంపాదించేందుకు పథకం వేసుకున్నారు.
బోరబండ ప్రాంతంలో కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు వెళుతున్న సరోజ్ కుమార్ దాస్, సయ్యద్ ఫయాజ్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితులను బోరబండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్