TS CM Convoy: ట్రాఫిక్ ఆంక్షల్లేకుండా సిఎం కాన్వాయ్ ప్రయాణం-plan is for the cms convoy to travel without traffic restrictions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cm Convoy: ట్రాఫిక్ ఆంక్షల్లేకుండా సిఎం కాన్వాయ్ ప్రయాణం

TS CM Convoy: ట్రాఫిక్ ఆంక్షల్లేకుండా సిఎం కాన్వాయ్ ప్రయాణం

HT Telugu Desk HT Telugu
Dec 19, 2023 06:29 AM IST

TS CM Convoy: సీఎం కాన్వాయ్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కూడళ్లలో ఐదు సెకన్ల పాటు మాత్రమే ట్రాఫిక్ ఆపనున్నారు.

సిఎం కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశాలు
సిఎం కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశాలు

TS CM Convoy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నేటి వరకు గతానికి భిన్నంగా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని ఇటీవల పోలీసులు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే.

yearly horoscope entry point

కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కూడా దాదాపు సగానికి తగ్గించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు నూతన పద్ధతిని పాటిస్తున్నారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని, సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

సీఎం ఆదేశాలతో పోలీసులు ఈనూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ బయల్దేరిన తరువాత ఐదు నుంచి ఆరు సెకన్ల గ్యాప్ తోనే పోలీసులు ట్రాఫిక్ ను వదులుతున్నారు.

జూబ్లీహిల్స్ నుంచి సచివాలయానికి…

జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే సీఎం రేవంత్ రెడ్డి....సచివాలయానికి వెళ్ళడానికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ద్వారా బాలకృష్ణ జంక్షన్, అక్కడ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అనంతరం ఎల్వీ ప్రసాద్ సర్కిల్, టివి 9 జంక్షన్, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ తాజ్ కృష్ణ మీదుగా ఖైరతాబాద్ జంక్షన్ కు సీఎం చేరుకుంటారు.

అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ రోడ్ నుంచి నేరుగా సచివాలయానికి సీఎం కాన్వాయ్ వెళుతుంది.అయితే ప్రతి జంక్షన్ లోనూ ఐదు సెకన్ల పాటు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారు. సీఎం కాన్వాయ్ ఒక జంక్షన్ క్రాస్ చేయగానే నార్మల్ ట్రాఫిక్ ను సెకన్ల వ్యవధిలోనే వదిలి పెడుతున్నారు.

జూబ్లీహిల్స్ నుంచి గాంధీ భవన్ కు....

జూబ్లీహిల్స్ నుంచి సీఎం గాంధీ భవన్ వెళ్ళాలంటే.....ఖైరతాబాద్ జంక్షన్ వరకు ఇదే మార్గంలో సీఎం కాన్వాయ్ వెళుతుంది.అక్కడ నుంచి లకడికా పుల్, అసెంబ్లీ మీదుగా నాంపల్లి, గాంధీ భవన్ కు సీఎం కాన్వాయ్ చేరుకుంటుంది. రేవంత్ రెడ్డి వెళ్లే మార్గాల్లో పోలీసులు పక్కా వ్యూహంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

Whats_app_banner