Dakshina Ayodhya: గోదారి నదీ తీరాన విరాజిల్లుతున్న "దక్షిణ అయోధ్య" మన భద్రాద్రి
Dakshina Ayodhya: రాముడు వెలసిన మహా పుణ్యక్షేత్రమే భద్రాద్రి. అందుకే భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తూ ఉంటారు.
Dakshina Ayodhya: శ్రీరాముని పరమ భక్తుడు భద్రుడు పేరిట భద్రాద్రిలో రాముని ఆలయం నిర్మితమవ్వడంతో ఈ ప్రాంతానికి భద్రాచలం లేక భద్రాద్రి అనే పేరు వచ్చింది.
అయోధ్య మేరుగు, మేడకల కుమారుడైన భద్రుడు శ్రీరాముని కోసం భీకరమైన తపస్సు చేస్తాడట. ఆ తపస్సుకు మెచ్చిన రాముడు భద్రాద్రిలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఇక్కడ వెలసిన రాముడిని భద్రుడు పేరున "భద్రగిరి నారాయణుడు" అని "వైకుంఠ రాముడు" అని పిలుస్తారు. అలాగే నిత్యం రాముడిని పూజించే కోకల దమ్మక్క కలలోకి వచ్చిన రాముడు తాను భద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం భద్రగిరిపై వెలిశానని చెప్పాడట.
దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న దమ్మక్క అక్కడ వెలసిన రాముడిని గుర్తించి దేవుడికి పందిరి వేసి నిత్యం నైవేద్యం పెడుతూ కొలిచేదట. సీతమ్మ తల్లితో కళ్యాణం జరిగిన ముహుర్తంలో ప్రతిఏటా కళ్యాణం కూడా జరిపించేదట.
ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న..
కేవలం పందిరిలోనే పూజలు అందుకుంటున్న సీతా సమేత శ్రీరామ చంద్రుడికి కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించాడు. గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులైన అక్కన్న, మాదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న. పాల్వంచ తాలూకాకు తహసీల్దార్ గా గోపన్న పని చేసేవాడు. +
ఆ కాలంలో భద్రగిరిపై వెలసిన శ్రీరాముడికి వీర భక్తుడిగా మారతాడు. కేవలం ఒక పందిరి కింద పూజలు అందుకుంటున్న శ్రీరామ చంద్రుడికి ఎలాగైనా ఆలయం నిర్మించాలని సంకల్పించుకుంటాడు. అయితే తహసీల్దార్ హోదాలో ఆయన ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములతో భద్రగిరిపై ఆలయాన్ని నిర్మించాడు.
ఇప్పుడు భద్రాచలంలో శ్రీరాముడు కొలువై సేవలందుకుంటున్న ఆలయం గోపన్న కట్టించినదే. కాగా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఆలయం నిర్మించిన విషయం తెలుసుకున్న తానీషా ఆ సొమ్మును ఖజానాలో జమ చేయాలని ఆదేశిస్తాడు.
అంత సొమ్మును ఒక్కసారిగా జమ చేయలేకపోయిన కంచర్ల గోపన్న చేతులు ఎత్తేయడంతో తానీశా అతనిపై చర్యలకు దిగుతాడు. కఠిన కారాగార శిక్షను విధించి గోపన్నను జైలు గోడల మధ్య చిత్ర హింసలకు గురి చేస్తాడు. ఆ సమయంలో శ్రీ రాముని దర్శనం కోసం గోపన్న విలపిస్తూ రాసిన కీర్తనలు జైలులో ఆయన అనుభవించిన దయనీయతను ప్రస్ఫుటం చేస్తాయి.
ఆ తర్వాత కాలంలో రాముని పరమ భక్తుడైన గోపన్న శ్రీ రామదాసుగా కీర్తించబడతాడు. ఆయన జైలులో రాసిన కీర్తనలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. కాగా 12 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాత గోపన్న దుస్థితిని ఆలకించిన శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా మారు వేషంలో వచ్చి ఆలయ నిర్మాణం నిమిత్తం గోపన్న ఖర్చు చేసిన సొమ్మును నయా పైసాతో సహా చెల్లించి తానీషా వద్ద రసీదు కూడా తీసుకెళతాడట.
అలా రామదాసుని రుణ విముక్తుడిని చేసి శిక్ష నుంచి తప్పించాడట. ఆ సమయంలో రామదాసుకి శ్రీరాముడు ప్రత్యక్షమై దర్శనమిచ్చాడని కూడా ప్రతీతి. ఆ నాడు శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణులకు రామదాసు చేయించిన బంగారు మోహరీలు, ఉత్సవ సామగ్రి ఇప్పటికీ మనం భద్రాచల దేవాలయంలో తిలకించవచ్చు.
అలాగే నాటి శాసనాలు కూడా చూడవచ్చు. ఇలా సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి భద్రాచలంలో కొలువై సేవలు పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ తీరాన ఎంతో చారిత్రిక నేపధ్యం కలిగిన శ్రీరాముని ఆలయం కావడంతో భద్రాద్రిని దక్షిణ అయోద్యగా పిలుస్తారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)