Cycle Track : ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్
Cycle Track : ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 23 కిలోమీటర్ల పొడవునా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ట్రాక్ ను వీలైనంత త్వరగా నగరవాసులకి అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నిస్తోంది.
Cycle Track : ప్రపంచ స్థాయి వసతులు, సదుపాయాలతో హైదరాబాద్ నగర వాసుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు తదితర అంశాల్లో అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక ప్రణాళికలను అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని హెచ్ఎండీఏ చేపట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా సైకిల్ ట్రాక్ నగర వాసులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేసే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. వివిధ రంగాలకు చెందిన వారు సైకిల్ రైడ్స్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో కూడా చాలా మంది సైక్లింక్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నగరవాసుల అభిరుచికి అనుగుణంగా ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపడుతోంది హెచ్ఎండీఏ. రింగ్ రోడ్డు వెంట 23 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఈ పనులను త్వరగా పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. ఇలాంటి సైకిల్ ట్రాక్ ఇప్పటి వరకు జర్మనీ, దక్షిణ కొరియాల్లో మాత్రమే ఉండగా భారత్ లో తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తుండటం విశేషం.
మొదట ఐటీ కారిడార్ పరిధిలోని ఈ ట్రాక్ ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నానక్‌రాంగూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, కోకాపేట, కొల్లూరు ప్రాంతాల్లోని ఓఆర్‌ఆర్ లోపలి వైపు ఉన్న సర్వీసు రోడ్డులో 4.5 మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ట్రాక్ చుట్టూ సివిల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ట్రాక్ పొడవునా పచ్చదనం, గార్డెన్ ల ఏర్పాటుకు సంబంధించిన వర్క్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ట్రాక్ పొడవునా సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్ల అమరిక పనులు మరో 10 రోజుల్లో మొదలు కానున్నాయి. ఇవి కూడా అతి త్వరలోనే పూర్తవుతాయి. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని.. ఆ వెంటనే నగర వాసులకి ట్రాక్ ని అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ట్రాక్ చుట్టూ సైకిళ్లు అద్దెకిచ్చే కేంద్రాలు, మరమ్మతులు చేసే వ్యవస్థ, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.