Nampally Numaish : నేటి నుంచి హైదరాబాద్ లో నుమాయిష్, ఫిబ్రవరి 15 వరకూ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Nampally Numaish : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే నుమాయిష్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Nampally Numaish : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ఎగ్జిబిషన్ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నిర్వహిస్తారు. కాగా ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే నిర్వాహకులు చేపట్టారు. ఈసారి దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 15 వరకు నుమాయిష్ ప్రదర్శన కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు అంతా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా?
- సిద్ధింబర్ బజార్ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే ఆర్టీసీ జిల్లా బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర భారీ వాహనాలను మోజంజహి మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
- బషీర్ బాగ్, కంట్రోల్ రూమ్ వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద బీజీఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
- బేగంబజార్, చత్రి నుంచి మల్లకుంట వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
- దారుస్సలాం నుంచి అఫ్జల్ గంజ్ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
- మూస బౌలి, బహదూర్ పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలకు సిటీ కాలేజీ వద్ద నయా పూల్, ఎంజే మార్కెట్ రూట్ లో మళ్లిస్తారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా