Maoists Letter : మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏకమయ్యాయి -మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్
Maoists Letter : ఇటీవల ఛత్తీస్ గఢ్, తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ రెండు ఎన్ కౌంటర్లపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటయ్యాయని ఆరోపించింది.
Maoists Letter : ఛత్తీస్‌గఢ్ దంతేవాడ జిల్లా ఆండ్రి గ్రామంలో ఈనెల 3న ఇన్ ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్, వందలాది పోలీసు బలగాలు పీఎల్జీఏ ఉన్న మకాంను చుట్టి ముట్టి జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకుగూడెం మండలం రఘునాథ పాలెం గ్రామంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్ లో ఆరుగురిని కోల్పోయామన్నారు. ఈ రెండు ఎన్‌కౌంటర్లపై రాష్టకమిటీ ప్రతిస్పందనను జగన్ శనివారం ఒక ప్రకటనలో వివరించారు.
మృతుల కుటుంబలు సానుభూతి
"ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఘటనలో ఏసోబు మరణించాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, టేకుల గూడెం గ్రామానికి వేలాదిగా కదిలి వచ్చిన ప్రజలు ఏసోబు అంతిమ యాత్రలో పాల్గొని భావేద్వేగంతో ఊరేగింపుగా సాగారు. ఈనెల 5వ తేదీన ఏసోబు అంతిమ యాత్ర కొనసాగుతుండగానే మరో విషాద వార్త విన్నాం. ఒకరు ఇచ్చిన సమాచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ్ పాలెం అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టులు ఉన్న మకాంను గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుమట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ పోరాటంలో ఆండ్రి గ్రామం వద్ద ప్రాణాలర్సించిన ఏసోబు, రఘునాదపాలెం గ్రామం వద్ద లచ్చన్న, తులసీ, రాము, కోసి, గంగాల్, దుర్గేష్ లకు కన్నీటీ నివాళి అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, బంధు, మిత్రులకు, మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం."-మావోయిస్టు అధికారి ప్రతినిధి జగన్
ఆపరేషన్ కగార్
సామ్రాజ్యవాదులు, దేశ, విదేశీ కార్పొరేట్లు, దోపిడీ పాలకుల సొంత లాభాల కోసం మాత్రమే భారతదేశంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో ఈ నరమేధం కొనసాగుతుందని జగన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి దేశ సంపదను, శ్రమను కారు చౌకగా అమ్మడానికి, దోపిడీ అనుకూల విధానాలు సరళం చేస్తున్నాయని ఆరోపించారు. దేశ వనరులను, శ్రమను కాపాడే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పీడిత ప్రజలు వైపు పోరాడుతుందన్నారు. ఈ ప్రజా పోరాటాలు వారి సొంత లాభాలకు అడ్డుగా మారడంతో మావోయిస్టు పార్టీని, పీడిత ప్రజలను నిర్మూలించాలని పథకం పన్నారన్నారు. దోపిడీ వర్గాలు తమ ఆర్థిక సంక్షోభాలను లేదా తమ మార్కెట్ విస్తరణను యుద్ధం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనుకుంటారు.
అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నాయని జగన్ ఆరోపించారు. సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్లకు దోచిపెట్టడంలో, మావోయిస్టు పార్టీని నిర్మూలించడంలో బీజేపీ, కాంగ్రెస్ లు వేర్వేరు కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి సాయుధ బలగాల మద్దతుతో పాటు ఆర్థిక బలం కావాలన్నారన్నారు. ఆనాటి నుండి కాంగ్రెస్ మావోయిస్టు పార్టీపై నిర్బంధాన్ని పెంచిందన్నారు.
ప్రజాపాలన పేరుతో
" కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవుల్లో అన్నే సంతోష్ సహా ముగ్గురు మావోయిస్టులు గ్రేహౌండ్స్ బలగాల దాడిలో మృతి చెందారు. జులై 25వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామేర తోగు అడవుల్లో విజేందర్ (అశోక్ ), సెప్టెంబర్ 5వ తేదీన రఘునాధం పల్లి గ్రామం వద్ద మరో ఘటనలో ఆరుగురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. అధికారంలోకి వచ్చిన నుండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నెత్తుటి ఏరులు పారిస్తుంది. ప్రజా పాలన పేరు చెప్పి హంతక పాలన కొనసాగిస్తుంది. రఘునాదపాలెం ఎన్ కౌంటర్ కు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి" అని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆ ప్రకటనలో కోరారు.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి)