KCR Poll Campaign : రెండు వారాల్లో ఎనిమిది సభలు, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన
KCR Poll Campaign : సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో ఎన్నికల శంఖారావం పూరించారు. కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా ఖరారైంది. నల్లగొండ జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఎనిమిది సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
KCR Poll Campaign : తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ సన్నద్దం అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. జిల్లా పర్యటనలు కూడా ఖరారు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండు వారాల వ్యవధిలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
తొలి సభ భువనగిరిలో
బీఆర్ఎస్ నాయకత్వం జిల్లాలో అధినేత సభల కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. సోమవారం (16వ తేదీ) నుంచి ఈ నెలాఖరున 31వ తేదీ దాకా రెండు వారాల్లో ఆయన ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మిగిలిన నాలుగు చోట్ల వచ్చే నెల 15వ తేదీ తర్వాత పర్యటనలు ఖరావు అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం సాయంత్రం ఆయన భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి భువనగిరి నుంచి ప్రచారం ప్రారంభించడం బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి సారి ఇక్కడ విజయం సాధించింది. అదే సమయంలో జరిగిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల్లోనూ గెలుపొందింది. ఆ తర్వాత 2018 లో జరిగిన రెండో ఎన్నికల్లోనూ ఆ పార్టీ తన సీటును నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇపుడు మూడో సారి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.
మునుగోడులో బహిరంగ సభ
పది రోజుల విరామం తర్వాత ఈ నెల 26వ తేదీన సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తొలిసారి 2014 లో విజయం సాధించినా 2018లో ఓటమి పాలైంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎన్నో హామీలను ఇచ్చింది. వాటిలో కొన్నింటిని నెరవేర్చగలిగినా.. పెండింగ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ కారణంగానే మొదట్లోనే ఇక్కడ సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేసి ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో ఏకంగా మూడు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇవన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. ఆలేరు, తుంగతుర్తి, కోదాడల్లో సీఎం సభలు ఉంటాయి. ఇందులో ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలను వరసగా రెండు సార్లు గెలుచుకుని హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నవే కావడం గమనార్హం. నెలాఖరున 31వ తేదీన కూడా జిల్లాలో ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచార బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలలో సభలు ఉంటాయి. ఇందులో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి వరసగా 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఈ సీటుకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండల్లో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్ రావు, రవీంద్ర కుమార్ లు ఉన్నారు.
నాలుగు చోట్ల నవంబరులోనే
మిగిలిపోయిన నాలుగు నియోజకవర్గాలు నాగార్జున సాగర్, సూర్యాపేట, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో నవంబరు 15వ తేదీ తర్వాత సభలు ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. నవంబరు 9వ తేదీన సీఎం కేసీఆర్ తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిశాక 15వ తేదీ తర్వాతనే సభలు ఉండనున్నాయి. గత నెలలోనే సీఎం కేసీఆర్ సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించి వివిధ పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. ఇక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ కారణంగానే సూర్యాపేటను తొలివిడత పర్యటన నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన నల్గొండను గత ఎన్నికల సమయంలోనే దత్తత తీసుకుంటున్నట్లు సీఎం నాటి ప్రచారంలో ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వివిధ డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తి కావాల్సి ఉంది. వీటి గురించి ప్రచారంలో ప్రస్తావించేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంత క్లిష్టంగా ఉన్న స్థానాల్లో పోలింగ్ కు కొద్ది రోజుల ముందు సీఎం సభలు పెడితే ప్రభావవంతంగా ఉంటుందని, ఓటర్లను కూడా కొంత ప్రభావితం చేయొచ్చన్న ఉద్దేశంతోనే నాగార్జున సాగర్, నకిరేకల్ స్థానాలను రెండో విడత పర్యటనలో పెట్టారని పార్టీ వర్గాల సమాచారం.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )