Nalgonda Politics : బీఆర్ఎస్ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి, కండువాలు మార్చేస్తున్న నేతలు- వలసలతో కాంగ్రెస్ ఖుషి-nalgonda brs key leaders join congress brs candidates in dilemma ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Politics : బీఆర్ఎస్ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి, కండువాలు మార్చేస్తున్న నేతలు- వలసలతో కాంగ్రెస్ ఖుషి

Nalgonda Politics : బీఆర్ఎస్ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి, కండువాలు మార్చేస్తున్న నేతలు- వలసలతో కాంగ్రెస్ ఖుషి

HT Telugu Desk HT Telugu
Oct 18, 2023 10:30 PM IST

Nalgonda Politics : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కౌంట్ డౌన్ దగ్గర పడుతుండడంతో నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. టికెట్ రాలేదని, అసమ్మతితో ఇలా వివిధ కారణాలతో నేతలు పార్టీలు జంప్ చేస్తున్నారు.

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

Nalgonda Politics : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో బయటి నుంచి వస్తున్న ఆఫర్లను కాదనలేక కొందరు.. ఇప్పటి దాకా ఎమ్మెల్యేలపై అసమ్మతి రగిలిపోయిన కొందరు కొత్త దారులు వెదుక్కుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరగడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు.

yearly horoscope entry point

బీఆర్ఎస్ నుంచే ఎక్కువ వలసలు

నల్లగొండ, నకిరేకల్, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కోదాడ.. ఇలా పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేల తీరు నచ్చక, ఇన్నాళ్లూ ఓపిక పట్టినా.. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఇక ఏం చేయలేరన్న ఆలోచనతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు గులాబీ కండువాను పక్కన పడేసి ఎక్కువగా కాంగ్రెస్ కండువాను కప్పుకుంటున్నారు. కొందరు కాషాయ కండువాలూ కప్పుకున్నారు. వారం రోజులుగా బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.

నల్లగొండలో

నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పేరు ప్రకటించగానే నియోజకవర్గానికి చేరుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చక్రం తిప్పారు. ఒకే రోజు ఆరుగురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లను లాగేసుకున్నారు. వీరిలో నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు బుధవారం కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రెండు రోజుల్లో ఏకంగా ఎనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వీడడం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ నియోజకవర్గంలో రూరల్ ఓటర్ల కన్నా.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ఓటర్లే అధికం. కాంగ్రెస్ కు ఉన్న కౌన్సిలర్లకు తోడు కొత్తగా ఎనిమిది వచ్చి చేరడం ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మంచి బలం చేకూరినట్లే. ఈ పరిణామం స్థానిక ఎమ్మెల్యే, అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డికి ఇబ్బందికరంగా మారనుంది.

కోదాడలో

కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థిని మార్చాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు పట్టపడుతున్నారు. కానీ, పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే బి ఫారం ఇవ్వడంతో అసమ్మతి నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె.శశిధర్ రెడ్డి, మైనారిటీ నాయకుడు మహ్మద్ జానీ, డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, మరో నాయకుడు ఎర్నేని బాబ ఇలా అంతా పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వేనేపల్లి చందర్ రావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా ఢిల్లీలో కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడు పడేలా లేదు.

నాగార్జున సాగర్ లో

నాగార్జున సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కూ ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని ముందు నుంచీ పార్టీలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. అయినా.. హైకమాండ్ పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జైవీర్ రెడ్డి ప్రకటించగానే ఆయన తండ్రి, పార్టీ సీనియర్ కుందూరు జానారెడ్డి రంగంలోకి దిగి పార్టీ బలం మరింత పెంచే దిశగా పావులు కదుపుతున్నారు. నిడమనూరు మండలంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. గుర్రంపోడు మండలంలో ఏకంగా పన్నెండు మంది సర్పంచులు, ఒక జెడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులను బీఆర్ఎస్ నుంచి తీసుకువచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పారు. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం ఖంగుతిన్నది. పార్టీలో అంతర్గత వర్గాలకు తోడు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఖాళీ అవుతుండడం ఆందోళనకు కారణమవుతోంది.

హుజూర్ నగర్ లో

హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరెడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీలతా రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి మన్నెం రంజిత్ యాదవ్ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇన్నాళ్లూ బలవంతంగా బీఆర్ఎస్ లో కొనసాగిన వారు.. తిరిగి తమ సొంత గూడు కాంగ్రెస్ కు చేరుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి విరుగుడుగా అక్కడక్కడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ తీసుకుంటోంది. కానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )

Whats_app_banner