Nagar Kurnool Crime : గుప్త నిధులు గుర్తిస్తానంటూ మోసాలు, తీర్థం పేరుతో యాసిడ్ పోసి 11 మందిని హత్య
Nagar Kurnool Crime : తాంత్రిక పూజలతో గుప్త నిధులు గుర్తిస్తానంటూ అమాయకులను మోసం చేసి, చివరికి వారి ప్రాణాలు తీస్తు్న్న కిరాతకుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Nagar Kurnool Crime : తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన కిరాతకుడిని నాగర్ కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రామటి సత్యనారాయణ జిల్లా కేంద్రంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, 2018లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత సత్యనారయణ కొత్త అవతారం ఎత్తాడు. తనకు తాంత్రిక పూజలు తెలుసని, ఇళ్లు, పొలాల్లో గుప్త నిధులను వెలికి తీస్తానంటూ అమాయక ప్రజలను నమ్మించాడు. డబ్బు ఆశతో ఈ మాయగాడి మాటలు నమ్మిన వారిని అతి కిరాతకంగా హత్య చేశాడు.
తీర్థం పేరుతో యాసిడ్ ఇచ్చి
గద్వాల జోన్ డీఐజీ చౌహాన్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. నిందితుడు సత్యనారాయణ గుప్త నిధుల పేరుతో నమ్మించి 11 మందిని కిరాతంగా హతమార్చాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాంత్రిక పూజలతో గుప్త నిధులు ఎక్కడున్నాయో చెప్తానంటూ అమాయకులను నమ్మించి వారి నుంచి భారీగా డబ్బు తీసుకునేవాడు. దీంతో పాటు వారి స్థలాలు సైతం రాయించుకునేవాడు. ఆ తర్వాత వారికి తీర్థం పేరుతో యాసిడ్ ఇచ్చి హత్య చేసేవాడు. తెలంగాణలోని వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, ఏపీలోని అనంతపురం, కర్ణాటకలోని బలగనూరు అమాయకులను హత్య చేశాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి హత్య చేసేవాడు.
ఆస్తులు రాయించుకుని హత్యలు
డబ్బులు లేనివారి దగ్గర స్థిరాస్తులను రాయించుకుని, నిధులు దొరికిన తర్వాత డబ్బులు ఇస్తే మళ్లీ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించేవాడు నిందితుడు సత్యనారాయణ. మోసపోయామని తెలిసి నిలదీస్తే క్షుద్రపూజల పేరిట దూరప్రాంతాలకు తీసుకెళ్లి హత్య చేసేవాడు. వనపర్తి జిల్లా నాగపూర్‌లో 2020లో ఒకే కుటుంబానికి చెందిన హజీరామ్‌బీ, అస్మాన్‌బేగం, ఖాజాపాషా, అర్షిణ్ బేగం దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో వీరు తాగిన పాలలో బంగారం కరిగించే రసాయనం కలిపినట్లు తెలిసింది. ఖాజాపాషా పేరిట ఉన్న ప్లాటును నిందితుడి పేరిట రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రాంరెడ్డి, ఆయన కూతురు కర్ణాటకలోని రాయచూర్‌లో ఇదే విధంగా హత్యకు గురయ్యారు. కల్వకుర్తికి చెందిన మరో వ్యక్తి సైతం ఇదే విధంగా హత్యకు గురయ్యారు.
ఎలా దొరికాడంటే?
వనపర్తి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. గత నెలలో అతడు దారుణంగా హత్యకు గురయ్యాడు. వెంకటేశ్ కుటుంబ సభ్యులు సత్యనారాయణ ప్రవర్తనపై అనుమానంతో నవంబర్ 26న నాగర్‌కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్ దగ్గర నిందితుడు సత్యనారాయణ డబ్బులు తీసుకున్న తర్వాత తాంత్రిక పూజల పేరుతో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు 11 హత్యలు చేసినట్లు గుర్తించారు.