BRS Station Ghanpur : కేటీఆర్ మంత్రాంగం... కడియంకి జై కొట్టిన రాజయ్య!-mla rajaiah support to kadiyam srihari in station ghanpur assembly constituency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Station Ghanpur : కేటీఆర్ మంత్రాంగం... కడియంకి జై కొట్టిన రాజయ్య!

BRS Station Ghanpur : కేటీఆర్ మంత్రాంగం... కడియంకి జై కొట్టిన రాజయ్య!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2023 02:04 PM IST

Telangana Assembly Elections : స్టేషన్ ఘన్ పూర్ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిరింది.

మంత్రి కేటీఆర్ తో శ్రీహరి, రాజయ్య
మంత్రి కేటీఆర్ తో శ్రీహరి, రాజయ్య (Twitter)

Station Ghanpur Assembly Constituency Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యేగా రాజయ్య ఉండగా... ఇదే సీటును ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి కేటాయించింది బీఆర్ఎస్. దీంతో రాజయ్య వర్గం... కడియంను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వస్తోంది. సీటు దక్కకపోవటంతో కన్నీటిపర్యంతమైన రాజయ్య.... ఈ మధ్య కాలంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టికెట్ మాత్రమే ప్రకటించారని... బీఫామ్ ఇవ్వలేదు కదా ఇంకా అంటూ మాట్లాడుతూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కేడర్ లో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది.

తాజా పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది గులాబీ పార్టీ నాయకత్వం. స్వయంగా మంత్రి కేటీఆర్... ఇవాళ ఇద్దరి నేతలతో ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా... రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై కేటీఆర్ గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

ఇద్దరు నేతలు ఒకటి కావటంతో... స్టేషన్ ఘన్ పూర్ పంచాయితీకి పుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. అయితే నేతలు కలిసినప్పటికీ... కేడర్ ఎలా ముందుకెళ్లబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే… ఇప్పటివరకు ఎవరికి వారిగా కార్యక్రమాలు చేస్తున్నాయి ఇరువర్గాలు. తాజాగా ఇద్దరు నేతలు కలిసిపోవటంతో…. ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తారా..? ఇద్దరు నేతలు కలిసే ప్రచారం నిర్వహిస్తారా…? అనేది ఘన్ పూర్ లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.