Minister Ponguleti Challenge: హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నా! నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి - మంత్రి పొంగులేటి
కేటీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో తన ఇళ్లు ఉంటే కూల్చేయవచ్చని స్పష్టం చేశారు. ఇదే విషయంపై హైడ్రా కమిషనర్ ను కూడా ఆదేశిస్తున్నానని చెప్పారు.
హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ తో పాటు హరీశ్ రావు వచ్చి తన ఇంటిని పరిశీలించుకోవచ్చని… టేప్ పెట్టి కొలిచి వివరాలను తెలుసుకోవచ్చని సవాల్ విసిరారు.
“కేటీఆర్, హరీష్ రావులకు ఓపెన్ చాలెంజ్ విసురుతున్నాను. మీరు ఇద్దరు మంత్రులుగా పని చేశారు కదా.. దమ్ముంటే నా ఇల్లు అక్రమ కట్టడమని నిరూపించండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కూడా ఆదేశిస్తున్నా! నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి. బీఆర్ఎస్ నేతలను కూడా వెంట తీసుకెళ్లండి. కొత్త టేపులు తీసుకెళ్లి కొలతలు తీయండి. ఏ చిన్న నిర్మాణం కూడా అక్రమ కట్టడం అని తేలితే వెంటనే కూల్చేయండి. ఇదే పొంగులేటి సవాల్” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి పలు అంశాలపై స్పందించారు. విద్య, వైద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఎనిమిది నెలలు కాకముందే బీఆర్ఎస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతుల విషయంలో త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసింది కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కాకముందే రూ. రుణమాఫీ ప్రక్రియను చేపట్టిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదన్నారు పొంగులేటి. రైతులెవరూ బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మవద్దని కోరారు. రుణమాఫీ కానీ రైతుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని… ఇప్పటికే దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైందని గుర్తు చేశారు. అవసరమైతే నిర్ణయించిన డబ్బుల కంటే వెయ్యి కోట్ల ఎక్కువైనా ఖర్చు చేస్తామన్నారు.