Minister Harishrao : పార్టీకి పట్టిన శని వదిలింది... పొంగులేటి టార్గెట్ గా మంత్రి హరీశ్ కామెంట్స్
BRS Party Latest News: కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటిని టార్గెట్ చేశారు మంత్రి హరీశ్ రావ్. శుక్రవారం ఖమ్మంలో మాట్లాడిన ఆయన…. ఖమ్మం జిల్లాకు పట్టిన శని వదిలిందంటూ కామెంట్స్ చేశారు.
Minister Harish Rao On Ponguleti: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావ్. శుక్రవారం ఖమ్మం జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... జిల్లా రాజకీయాలపై స్పందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పట్టిన శని వదిలిందన్నారు. శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచేవాళ్లు పార్టీ నుంచి వెళ్లి పోయారంటూ పరోక్షంగా... మాజీ ఎంపీ పొంగులేటిని టార్గెట్ చేశారు. తాము వద్దనుకున్న వాళ్లను కాంగ్రెస్ తీసుకుంటోందని... దాంతో ఎదో అవుతుందని భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
కొందరిని తాము పక్కన పెడితే మీరు పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు మంత్రి హరీశ్. గతంలో పొంగులేటిని గుత్తేదారు... ఆర్థిక ఉగ్రవాది అంటూ భట్టి విక్రమార్క మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటి పొంగులేటి ఇప్పుడు భట్టికి ఎలా ముద్దు అయ్యాడని ప్రశ్నించారు. గత ఎన్నికల మాదిరిగా కాకుండా... వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో సీన్ రివర్స్ అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ 9 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో ఆసరా రూ .2000/4000 వేలు ఇస్తున్న రాష్ట్రం ఉందా..? అని హరీశ్ రావ్ ప్రశ్నింటారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా ఉందా అని నిలదీశారు. "ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ అమలు జరుగుతుందా..? మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నారా..? కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులాంటిది కట్టారా..? కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కేసీఆర్ కిట్లు ఇస్తున్నారా ? కాంగ్రెస్ పాలనలో రైతన్నలు సాగునీళ్లు కోసం ధర్నాలు రాస్తోరోకులు జరిగాయి. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు జరిగాయి. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా" అంటూ మంత్రి హరీశ్ రావ్ ప్రశ్నించారు.
మరోవైపు జులై 2వ తేదీన పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.జనగర్జన పేరుతో సభను తలపెట్టారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. పార్టీని వీడిని పొంగులేటి… గత కొంతకాలంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవనివ్వని కూడా సవాల్ విసిరారు. ఇప్పటికే పలువురిని తన వెంట కాంగ్రెస్ లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో… ఖమ్మం సభ వేదికగా ఎలాంటి ప్రకటన చేస్తారు…? బీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన జిల్లాలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం