Medico Suicide: మర్మాంగం కోసుకుని మెడికో ఆత్మహత్య..
Medico Suicide: మానసిక సమస్యలతో సతమతం అవుతున్న వైద్య విద్యార్ధిని మర్మాంగాలను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
Medico Suicide: సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న దీక్షిత్‌రెడ్డి(21) అనే యువకుడు ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మానసికస్థితి సరిగా లేకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివసిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఉన్నారు. దీక్షిత్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతంలో నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అప్పటి నుంచి తల్లిదండ్రులు దీక్షిత్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయిస్తున్నారు. చిన్న వయసులోనే మందులు వేసుకోవాల్సి వస్తోందని మనోవేదనకు గురయ్యేవాడు. కుటుంబ సభ్యులు బయటకెళ్లి ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు.
ఇంట్లో ఉన్న దీక్షిత్‌రెడ్డి ఎంతకీ తలుపు తీయలేదు. ఆందోళన చెంది కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108కు ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి చూసేసరికి మర్మాంగం కోసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యార్ధి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది.