Medak Accident : బతుకుదెరువు కోసం అనంతలోకాలకు, గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి-medak two jharkhand migrant workers died constructed wall collapsed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Accident : బతుకుదెరువు కోసం అనంతలోకాలకు, గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి

Medak Accident : బతుకుదెరువు కోసం అనంతలోకాలకు, గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి

HT Telugu Desk HT Telugu
Nov 11, 2024 09:48 PM IST

Medak Accident : బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరు వలస కూలీలు ప్రమాదవశాత్తు మరణించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో నిర్మాణంలో ఉన్న పౌల్ట్రీ గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

బతుకుదెరువు కోసం అనంతలోకాలకు, గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి
బతుకుదెరువు కోసం అనంతలోకాలకు, గోడ కూలి ఇద్దరు వలస కూలీలు మృతి

ఎక్కడి నుండో వలస వచ్చి, ఇక్కడ ఏదో ఒక పనిచేసి తమ కుటుంబానికి పోషించుకోవాలి అనే ఆశతో వచ్చిన, వలస కార్మికులు బతుకులు ఇక్కడే తెల్లారిపోయాయి. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ నుంచి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన కార్మికులు నిర్మాణ పనులు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి కార్మికులపై పడింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం బాస్నా గ్రామానికి చెందిన కూలీలు వసిక్ కూల్ అలాం, రఫీక్ అలాం, నసీం అక్తర్, ఇంతసార్ అలాం గత కొంతకాలం క్రితం మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు వలస వచ్చారు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

గోడ కూలి మీద పడడంతో ఇద్దరు మృతి

ఈ క్రమంలో చిన్నశంకరంపేట మండల పరిధిలోని కామారం తండాకు చెందిన ఏనుగు సాయిబాబా రెడ్డికి సంబంధించిన కోళ్లఫారం నిర్మాణ పనుల్లో కొద్ది రోజులుగా పనిచేస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం కూలీలు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు నూతనంగా నిర్మించిన అదే గోడ కూలి అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయిన, వసిక్ కూల్ అలాం (27), రఫీక్ అలాం (20) అనే ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు నసీం అక్తర్, ఇంతసార్ అలాంకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చేగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ ఘటన స్థలాన్ని పవారి రిశీలించి, ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి

వారితో పనిచేస్తున్నవలస కార్మికులకు పౌల్ట్రీ షెడ్ ఓనర్ సాయిబాబా రెడ్డి తగిన పరిహారం చెల్లించి, వారి వారి శవాలను స్వగ్రామాలకు పంపించడంలో సహాయం చేయాలనీ డిమాండ్ చేసారు. అధేవిధింగా, సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పౌల్ట్రీ షెడ్ గోడ నాసిరకంగా కట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చిచెప్పారు. అదేవిధంగా, కట్టిన మేస్త్రి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం