Minister Harish Rao : కాంగ్రెస్ గెలిస్తే ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు రూ.15 వేలు మాత్రమే -హరీశ్ రావు
Minister Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు కింద రూ.15 వేలు మాత్రమే ఇస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రూ.16 వేలు ఇస్తామన్నారు.
Minister Harish Rao : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ప్రతి రైతుకు 15 వేల రూపాయలు మాత్రమే రైతుబంధు ఇస్తారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతు బంధుకు ఆద్యుడైన సీఎం కేసీఆర్ ఈసారి గెలిస్తే ఎకరానికి రైతు బంధు కింద ఇచ్చే రూపాయలను ఇప్పుడు ఇచ్చే రూ 10,000 నుంచి రూ 16,000 లకు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు.
బీఆర్ఎస్ తిరస్కరించిన నాయకులే కాంగ్రెస్ కు దిక్కు
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తిరస్కరించిన నాయకులని పోటీలోకి దింపుతోందని, పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని తాండూరు మీటింగ్ లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒకరకంగా వాస్తవం చెప్పి మన నెత్తి మీద పాలు పోశారని మంత్రి అన్నాడు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అంటాడని, ఆయనది రైతులకు రూపాయి ఇచ్చిన ముఖమా అని ప్రశ్నించాడు. గత ప్రభుత్వాలు రైతుల వద్ద పన్నుల రూపంలో డబ్బులు తీసుకున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు డబ్బులు తిరిగి ఇస్తుందని అన్నారు.
సన్నబియ్యానికి రూ 1,300 కోట్లు అధికంగా ఖర్చు
రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ 1,300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని,అయినా ముఖ్యమంత్రి సన్నబియ్యం ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఈసారి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని అన్నారు. సౌభాగ్య లక్ష్మి ద్వారా ప్రతి మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వబోతున్నామన్నారు. రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు మందికి చెయ్యబోతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆసరా పింఛన్లు రూ.5 వేలుపెంచబోతున్నామని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.15 లక్షల వరకు చికిత్స ఉచితంగా అందించబోతున్నామన్నారు. అసైండ్ ల్యాండ్స్ ఉన్నవారికి పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు.
ఎకరానికి 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటుంది
ఛత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటుందని, మిగతావి కొనరు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందన్నారు. ఈ పదేళ్లలో ఎంతో మార్పు వచ్చిందని ఇంకా ఎంతో చేసుకుందామని, భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని మోసపోతే గోస పడతామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రజల్లో ఉండి నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తారన్నారు.