Mandamarri Incident : మేకలను మాయం చేశారనే నెపంతో- తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు-mancherial mandamarri two people tied upside down suspicion theft goats ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mandamarri Incident : మేకలను మాయం చేశారనే నెపంతో- తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Mandamarri Incident : మేకలను మాయం చేశారనే నెపంతో- తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 03, 2023 03:12 PM IST

Mandamarri Incident : మేకలను మాయం చేశారనే నెపంలో ఇద్దరు వ్యక్తులను తలకిందులుగా కట్టి తీవ్రంగా కొట్టిన ఘటన మందమర్రిలో జరిగింది.

మందమర్రిలో అమానుష ఘటన
మందమర్రిలో అమానుష ఘటన

Mandamarri Incident : మంచిర్యాల జిల్లా మందమర్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మేకలను దొంగతనం చేశారనే నెపంతో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములుకు చెందిన మేకల మంద నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయింది. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. షెడ్డులో వారిని బంధించి తాళ్లతో తలకిందులుగా వేలాడదీశారు. కింద పొగ పెట్టి వారిద్దరిని తీవ్రంగా కొట్టారు. బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేయగా కొమురాజుల రాములు, మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు.

అసలేం జరిగింది?

మంచిర్యాల జిల్లా మందమర్రిలో మేకను దొంగతనం చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివశిస్తున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలోని షెడ్డులో వారు మేకలను పెంచుతున్నారు. మేకల మందలోంచి రెండు మేకలను దొంగిలించారనే నెపంతో మేకల కాపరితో పాటు అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని షెడ్డులో బంధించి చిత్రహింసలు పెట్టారు. పశువుల కాపరి తేజ, దళిత యువకుడైన చిలుముల కిరణ్‌ను షెడ్డు వద్దకు పిలిపించి... తాళ్లతో తలకిందులుగా కట్టి కింద పొగ పెట్టి వారిద్దరిని తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరిలో వాకబు చేశారు. దీంతో తన సోదరుడ్ని కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నలుగురి అరెస్ట్

మందమర్రిలో మేకలు దొంగతనం చేశారంటూ పశువుల కాపరి తేజతో పాటు దళిత యువకుడు కిరణ్‌ను వేలాడదీసి తీవ్రంగా కొట్టిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. తమ అక్క కొడుకు కిరణ్ కనిపించడం లేదని, బాధితుడి చిన్నమ్మ సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మేకల యజమాని కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్, పనిమనిషి నరేష్‌లపై 342, 367 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆదివారం ఆ నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులు నలుగురినీ రిమాండ్‌కు తరలించారు. కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కోసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

Whats_app_banner